Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2206

సమీక్ష : కథకళి –ఫర్వాలేదనిపించే స్క్రీన్‌ప్లే గేమ్!

$
0
0
Kathakalli review

విడుదల తేదీ : 18 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : పాండిరాజ్

నిర్మాత : విశాల్

సంగీతం : హిపాప్ థమిజా

నటీనటులు : విశాల్, క్యాథరిన్ థ్రెసా..

తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్, తాజాగా ‘కథకళి’ అనే థ్రిల్లర్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళనాట జనవరి నెల్లోనే పొంగల్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు తెలుగులో ఇప్పటికి సరైన రిలీజ్ దొరికింది. జాతీయ అవార్డు పొందిన దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ నిజంగానే థ్రిల్ చేసేలా ఉందా? చూద్దాం..

కథ :

అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండే కమల్ (విశాల్), ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి (క్యాథరిన్)ని పెళ్ళి చేసుకోవడం కోసం సొంత ఊరైన కాకినాడ వస్తాడు. అతడి పెళ్ళికి సంబంధించిన పనులు జరుగుతున్న కాలంలోనే, అదే ఊర్లో ఉండే సాంబ (మధుసూదన రావు) అనే జాలర్ల సంఘం అధ్యక్షుడు హత్య కాబడతాడు. కాకినాడలో తానే అన్ని దందాలూ చేయాలనుకునే సాంబకు, కమల్ కుటుంబానికి గతంలో ఓ గొడవ జరిగి ఉండడంతో సాంబ హత్య విషయమై పోలీసులు కమల్‌ని కూడా అనుమానిస్తారు. ఓ చిన్న సంఘటన ఈ అనుమానాన్ని బలపరుస్తుంది.

ఇక అక్కడినుంచి మొదలైన అసలు కథ ఏయే మలుపులు తిరిగిందీ? సాంబను ఎవరు హత్య చేశారు? కమల్ అన్నయ్యే సాంబను చంపాడా? సాంబకు, కమల్ కుటుంబానికి మధ్యన జరిగిన గొడవేంటీ? పెళ్ళికి సిద్ధమవుతోన్న తరుణంలో వచ్చిన ఇన్ని ఇబ్బందులను కమల్ ఎలా ఎదుర్కొన్నాడూ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ‘కథకళి’.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదట్నుంచీ, చివరివరకూ ఎక్కడా పడిపోకుండా రకరకాల సంఘటనలకు సరిగ్గా కలుపుతూ అల్లుకున్న స్క్రీన్‌ప్లే స్టైల్ గురించి చెప్పుకోవచ్చు. ఒక చిన్న పాయింట్‌నే రెండు గంటల సినిమాగా చెప్పడంలో ఈ స్క్రీన్‌ప్లే స్టైల్‌దే కీలక పాత్ర అని చెప్పుకోవాలి. సినిమాలో పగ అనే అంశాన్ని రెండు కోణాల్లో చూపిస్తూ చివర్లో గానీ అసలు కోణాన్ని బయటపెట్టకుండా చేసిన ప్రయత్నం చాలా బాగుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌ను కథతో పాటు నడిపిన విధానం కూడా బాగా ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ నెరేషన్‌ను పక్కదారి పట్టించకుండా సెకండాఫ్‌ను నడపడంతో సినిమా మంచి వేగంతో నడుస్తుంది. ‘కథకళి’ అన్న పేరేందుకు పెట్టారన్నది కూడా చివరివరకూ తెలియనీయక పోవడం బాగుంది.

హీరో విశాల్ చాలా సహజంగా ఎక్కడా అతికి పోకుండా పాత్ర పరిధిలోనే ఉండే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆ పాత్రను తయారు చేసిన విధానం కూడా బాగుంది. క్యాథరిన్ థ్రెసా క్యూట్‌గా బాగుంది. విలన్‌గా మధుసూదన్ రావు చాలా బాగా చేశాడు. మిగతా నటీనటులంతా తమ పరిధి మేర బాగానే నటించారు. సినిమా పరంగా చూసుకుంటే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్.. ఇలా సినిమా పతాక సందర్భాలన్నిచోట్లా మంచి థ్రిల్స్ ఇస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే కథ చాలా చిన్నది కావడం గురించి చెప్పుకోవాలి. ఇంత చిన్న కథను సినిమాగా చెప్పడంలో మంచి స్క్రీన్‌ప్లే సహకారం తీసుకున్నా అసలు కథలోనే ఇంకాస్త ఎమోషన్ ఉంటే బాగుంటుందనిపించింది. ఇక హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ కూడా సాదాసీదాగా ఉంది. ఈ ఎపిసోడ్ కొంత ఓవర్ కూడా అయింది. ఇక ఫస్టాఫ్‌లో అసందర్భంగా వచ్చే పాటలు కూడా సినిమా మూడ్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఇంట్రో సాంగ్ అవసరమే లేదని చెప్పొచ్చు.

క్లైమాక్స్ ఫైట్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. అదే విధంగా చివర్లో ఎండ్ కార్డ్ వద్ద వచ్చే ట్విస్ట్ సినిమాకు ఒకరకంగా ప్లస్ కాగా, అదే ప్లస్ మన సినిమా ఇంకా మూస ధోరణినే నమ్ముకుందన్న ఫీలింగ్ కలిగించేలా ఉంది. సినిమా కథలో రకరకాల ట్విస్ట్‌లు పరిచయమవుతున్న క్రమంలో కొన్నిచోట్ల లాజిక్‌ను పక్కన పెట్టేశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా కథకళి ఉన్నతంగా ఉంది. ఒక చిన్న కథను రెండు గంటల సినిమాగా మలచడంలో దర్శక, రచయిత పాండిరాజ్ ప్రతిభను అభినందించాలి. ముఖ్యంగా ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే పరంగా ఆయనకు ఎక్కువ మార్కులు వేయొచ్చు. లవ్‌ట్రాక్ విషయంలో, ఉపకథలను పెట్టడం విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదినిపించినా, దర్శకుడిగా మాత్రం పాండిరాజ్ మేకింగ్ పరంగా చాలాచోట్ల ప్రయోగాలు చేసి మెప్పించారు.

ఇక హిపాప్ థమిజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతంతమాత్రమే ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో హిపాప్ థమిజా ప్రతిభను బాగుంది. బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రాత్రి సన్నివేశాల్లో ఆయన చేసిన ప్రయోగం కట్టిపడేస్తుంది. ఎడిటింగ్ బాగుంది. విశాల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన గత సినిమాల్లానే ఈ సినిమాకూ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

విశాల్ సినిమాలు ఎక్కువగా కుటుంబ నేపథ్యంతో ముడిపడి ఉన్న యాక్షన్ ఎంటర్‍టైనర్సే అయి ఉంటాయి. ‘కథకళి’ కూడా అందుకు మినహాయింపేమీ కాకపోయినా, ఇక్కడ ఫ్యామిలీ ఎమోషన్‌ను ఉపకథగానే ఉంచి ప్రధాన కథైన మర్డర్ మిస్టరీకి దీన్ని ముడిపెట్టడమే బాగా ఆకట్టుకునే అంశం. ఒక పూర్తి స్థాయి థ్రిల్లర్‌కు సరిపడే కథ కాకపోయినా, బోర్ కొట్టించని కథనం, సినిమాకు కీలకమైన సందర్భాల్లో మంచి థ్రిల్స్‌తో కొన్ని ట్విస్ట్‌లు ఉండడం, అన్నింటికీ మించి క్లైమాక్స్ ట్విస్ట్ లాంటివి ఈ సినిమాకు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇకపోతే, పూర్తిగా ఒకే పాయింట్‌పై నడిచినట్టు కనిపించే కథ, అక్కడక్కడా అవసరం లేని సన్నివేశాలు, అసందర్భమైన పాటలు, పెద్దగా ఆకట్టుకోని లవ్‌ట్రాక్ లాంటివి మైనస్‍లుగా చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పెద్దగా అంచనాలేవీ లేకుండా వెళితే ఈ థ్రిల్లర్‌ను ఓసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్రిల్లర్ అనగానే దానికంటూ పెట్టుకునే అంచనాలతో వెళితే మాత్రం నిరాశే!

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW


Viewing all articles
Browse latest Browse all 2206

Trending Articles