Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : ప్రేమికుడు –పూర్తిగా బోర్ కొట్టించాడు..!

$
0
0
Premikudu review

విడుదల తేదీ : 17 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : కళా సందీప్

నిర్మాత : లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి

సంగీతం : విజయ్ బాలాజీ

నటీనటులు : మానస్, సనంశెట్టి..

మానస్, సనం శెట్టి హీరో హీరోయిన్లుగా నటించగా, దర్శకుడు కళా సందీప్ తెరకెక్కించిన సినిమా ‘ప్రేమికుడు’. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

శ్రీ (మానస్) ఏ పనీపాటా లేకుండా కాలం వెళ్ళదీసే ఓ యువకుడు. ఎవరైనా డబ్బున్న అమ్మాయిని ప్రేమించి, లైఫ్‍లో సెటిల్ అయిపోవాలన్నది శ్రీ కల. ఈ క్రమంలో కొన్నిసార్లు విఫలమయ్యాక, శ్రీకి కృష్ణ (సనం శెట్టి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత కృష్ణని మనస్ఫూర్తిగా ప్రేమించిన శ్రీ, ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాలని సిద్ధపడే సమయంలోనే కృష్ణకు ఉన్న ఓ ప్రమాదం గురించి, ఆ ప్రమాదంలో ఆమె అప్పటికే చిక్కుకొని ఉండడం గురించి తెలుసుకుంటాడు. ఇక శ్రీ, కృష్ణని కాపాడుకోడానికి ఏమేం చేశాడన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే సెకండాఫ్‌లో వచ్చే మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాల గురించి చెప్పుకోవాలి. అసలు కథంతా రివీల్ అయ్యే ఈ భాగం ఉన్నంతలో బాగుంది. ఇక హీరో మానస్ ఏమీ లేని సినిమాను తన ఎనర్జీతో లాగే ప్రయత్నం చేశాడు. యాక్టింగ్ పరంగా మానస్ ఎనర్జిటిక్‍గా కనిపిస్తూ బాగానే చేశాడు. ఫస్టాఫ్‌లో షకల శంకర్ కామెడీ బాగుంది. ఇక నాటితరం నటుడు భాను చందర్ కనిపించే రెండు సన్నివేశాల్లోనే మెప్పించారు. కౌసల్య ఎపిసోడ్ అంటూ వచ్చే అడల్ట్ కామెడీ, ఆ తరహా సన్నివేశాలు కోరేవారికి నచ్చుతుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా అసలు కథ ఏంటో ఎక్కడా అర్థమైనట్లు కనిపించలేదు. ఒక్క చిన్న అర్థం లేని పాయింట్‌ను పట్టుకొని దానిచుట్టూ అల్లిన కథలో చేయడానికి కూడా ఏమీ లేక అడుగడుగునా సినిమా బోరింగ్‌గా సాగిపోయింది. ఇక ఫస్టాఫ్ ఎలాగూ అర్థం లేని సన్నివేశాలతో నడిచినా, సెకండాఫ్ కాస్త బాగుందనుకునేలోపే పూర్తిగా పక్కదారి పట్టేసింది. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం ఒకే ఒక్క సన్నివేశాన్ని తిప్పి తిప్పి చూపించినట్లనిపించింది. కథ, కథనాలతో పాటు చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఎగ్జైటింగ్‌గా లేదు. ఇక హీరోయిన్‌కు ఉన్న ఆపద, దానిచుట్టూ వచ్చే సన్నివేశాలు చాలా సిల్లీగా ఉన్నాయి.

ఇక పాటలు ఎప్పుడు ఎందుకు వస్తాయో తెలియదు. ఒక పాట అటూ ఇటూగా ఓ పది నిమిషాలు వచ్చి విసుగు పుట్టించింది. హీరోయిన్ పాత్రకు అస్సలు క్లారిటీ అన్నదే లేదు. ఆ పాత్రలో నటించిన సనం శెట్టి గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగానూ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచిన వారెవ్వరూ లేరు. దర్శకుడు కళా సందీప్ ఎంచుకున్న కథతో పాటు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా అర్థం కానట్లుగా ఓ బోరింగ్ స్క్రీన్‍ప్లే రాసుకున్నారు. కథలో ఒకటి రెండు చోట్ల తప్ప ఎమోషన్ అన్నదే లేకపోవడం దర్శకుడి వైఫల్యంగానే చెప్పుకోవాలి. సెకండాఫ్ సస్పెన్స్ సీన్‌ మేకింగ్‌లో మాత్రం సందీప్, దర్శకుడిగా మంచి ప్రతిభే చూపాడు.

సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. విజయ్ బాలాజీ అందించిన పాటల్లో రెండు పాటలు ఫర్వాలేదనుకున్నా, ఏ పాటా సందర్భానికి తగ్గట్టుగా లేకపోవడంతో అవి కూడా వృథానే అయ్యాయి. ఎడిటింగ్ బాలేదు. డైలాగ్స్ కొన్నిచోట్ల ఫర్వాలేదనిపించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలంటే, అవి కొత్తదనంతో నిండినవో, లేదా ప్రేక్షకుడిని కట్టిపడేసే స్థాయిలో ఉండేవో అయి ఉండాలని అందరూ చెప్పే మాట. అలా వచ్చిన చాలా సినిమాలు సంచలన విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఇక ఈ సూత్రం తెలిసి కూడా పక్కా ఫార్ములా కథలను, అదీ అరిగిపోయిన కమర్షియల్ అంశాలతో చెప్పాలనుకోవడమే ‘ప్రేమికుడు’ విషయంలో జరిగిన అతిపెద్ద తప్పు. కథ, కథనాల్లో ఎక్కడా ఓ స్పష్టత గానీ, ఎమోషన్ కానీ లేకపోవడం, ఎందుకొస్తున్నాయో తెలియని పాటలు, అర్థం లేని సస్పెన్స్ ఎలిమెంట్ ఇవన్నీ కలిపి ప్రేమికుడుని ఓ సాదాసీదా సినిమాగా కూడా నిలపలేకపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ‘ప్రేమికుడు’ మెప్పించకపోగా, నొప్పిస్తాడు!

123telugu.com Rating : 2 /5
Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles