Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష : అర్ధనారి –సందేశాన్నిచ్చే ఓ ప్రయత్నం!

$
0
0
Rojulu Marayi review

విడుదల తేదీ : 01 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : భానుశంకర్ చౌదరి

నిర్మాత : ఎమ్. రవికుమార్

సంగీతం : రవివర్మ

నటీనటులు : అర్జున్ యజత్, మౌర్యాని

సాధారణంగా మన తెలుగు పరిశ్రమలో ఇప్పటి వరకూ హిజ్రాల పాత్రతో పెద్దగా సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి సినిమాలు ఏవైనా వచ్చాయి అంటే అవన్నీ తమిళ డబ్బింగ్ సినిమాలే. అవి కూడా దాదాపు అన్నీ హారర్ బేస్డ్ థీమ్ తో వచ్చి మనల్ని భయపెట్టిన సినిమాలే. మరిప్పుడు మన తెలుగులో కొత్త దర్శకుడు ‘భాను శంకర్ చౌదరి’ హిజ్రా పాత్రను ప్రధానంగా తీసుకుని కొత్త నటీ నటులైన అర్జున్ యజత్, మౌర్యాని జంటగా సోషల్ ఎలిమెంట్స్ తో ‘అర్థనారి’ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

హిజ్రా అయిన అర్ధనారి (అర్జున్ యజత్) హైదరాబాద్ సిటీలోకి ఎంటరవుతూనే హత్యలు చేయడం ప్రారంభిస్తుంది. పోలీసులకు దొరక్కుండా వరుసగా టార్గెట్ ప్రకారం పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తూ ఉంటుంది. దీంతో ఈ కేస్ పోలీసులకు పెద్ద సమస్యగా మారుతుంది. చివరికి ఒక చిన్న క్లూ ద్వారా అర్థనారిని అరెస్టు చేసిన పోలీసులు, ఆమెను కోర్టు ముందు నిలబెట్టి హత్యలు చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తారు.

కానీ ఆర్థనారి మాత్రం పోలీసులకు, కోర్టుకు సమాధానం చెప్పకుండా ప్రజలతోనే నేరుగా మాట్లాడతానని చెబుతుంది. అలా అర్థనారి ప్రజలతో ఏం మాట్లాడింది? అసలు ఆమె ఎవరు? ఆమె గతం ఏమిటి? ఆ హత్యలు ఎందుకు చేసింది? ఆ హత్యల ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంది? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ముందుగా ప్రస్తావించాల్సింది దర్శకుడు భానుశంకర్ చౌదరి ఎంచుకున్న ‘భాద్యత లేనివాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు’ అన్న కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ దాన్ని ఓ హిజ్రా పోరాటం రూపంలో చెప్పాలని దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. ప్రధానంగా సినిమా రెండవ భాగంలో దర్శకుడు కథనాన్ని నడిపిన తీరు, చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం ఆకట్టుకుంటుంది.

అలాగే ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ మొదటి భాగంలో అర్థనారి, రెండవ భాగంలో గుడిపూడి శివ కుమార్ పాత్రల్లో నటించిన హీరో అర్జున్ యజత్ నటన. కెరీర్ ఆరంభంలోనే రెండు ఛాలెంజింగ్ పాత్రలను తీసుకుని ఆ పాత్రల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఓ ఆవేశపరుడైన భాద్యత గల వ్యక్తిగా అతని నటన కట్టిపడేసేలా ఉంది. సినిమా పరంగా సెకండాఫ్‌లోని ఎమోషన్‌ను మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది మొదటి భాగం నిడివి. ఈ భాగంలో అర్థనారి పాత్ర మెప్పించినప్పటికీ ఆ పాత్ర లెంగ్త్, మొదటి భాగం రన్ టైమ్ మరీ ఎక్కువవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. అలాగే అర్థనారి ప్రభుత్వాధికారుల్ని చంపే విధానం కూడా అంత ఆమోదయోగ్యాంగా లేదు. పెద్ద పెద్ద అధికారుల్ని సైతం చాలా సింపుల్ గా చంపేయడం మింగుడుపడదు. ఇక అర్థనారి పాత్రలో ఎమోషన్ కూడా పెద్దగా లేకపోవడం మైనస్ పాయింట్. ఈ నేపథ్యంలోనే వచ్చే కొన్ని సన్నివేశాలు అసలు కథ ఆలోచనను కొన్నిసార్లు పక్కదారి పట్టించాయి.

అలాగే అర్థనారి పాత్రకు నిద్రపోకుండా తేళ్ళతో కరిపించుకునే ఓ విచిత్రమైన గుణం ఉంటుంది. అసలు ఆ గుణానికి కారణం ఏమిటనేది చూపించలేదు. పైగా ఆ పాత్ర ఆవిర్భవించే సన్నివేశం కూడా కాస్త బలహీనంగా ఉంది. ఇక సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొన్ని చోట్ల కథ లాజిక్‌కు అందని సన్నివేశాలతో నడిచింది. ఫస్టాఫ్‌లో సన్నివేశాలన్నీ కాస్త లౌడ్‍గా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ వృథా అనిపించింది. కథను హైద్రాబాద్ నేపథ్యంగా నడుపుతూ, లొకేషన్స్‌ను మాత్రం అందుకు భిన్నమైనవి ఎంచుకోవడం ఏమాత్రం అతకలేదు.

సాంకేతిక వర్గం :

సాంకేతిక వర్గం విషయానికొస్తే కథ, సెకండ్ హాఫ్ కథనాన్ని తయారు చేసుకోవడంలో దర్శకుడు భాను శంకర్ చౌదరి రచయితగా మంచి మార్కులే అందుకున్నాడు. దర్శకుడిగా ఫస్టాఫ్‌లో ఆయన పెద్దగా మెప్పించకపోగా, లౌడ్ సన్నివేశాలను రాసుకున్నారు. ఇక కాస్త లాజిక్‌గా ఆలోచించి, మంచి మేకింగ్ వ్యాల్యూస్‌తో ఫస్టాఫ్ నడిపి ఉంటే బాగుండేదనిపించింది.

పతాక సన్నివేశాల్లో రవి వర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఫర్వాలేదు. నివాస్ రాసిన డైలాగులు కొన్ని ఆలోచింపదగ్గ విధంగా బాగున్నాయి. ఎడిటింగ్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. మరీ ఫస్టాఫ్‌లో సన్నివేశాల మధ్యన ట్రాన్సిషన్ కూడా బాలేదు. సినిమాటోగ్రఫీ సాదాసీదాగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంతమాత్రమే!

తీర్పు :

‘భాధ్యతలేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదం’టూ ఓ సందేశాత్మక కథనంతో మనముందుకొచ్చిన సినిమా ‘అర్ధనారి’. మంచి ఎమోషన్‌తో సాగే సెకండ్ హాఫ్, బాగుందనిపించే హీరో నటన లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో ఫస్టాఫ్ అంతా లాజిక్ లేకుండా, లౌడ్‌గా సాగడం, కొన్నిచోట్ల చెప్పాలనుకున్న అంశంలో స్పష్టత కోల్పోవడం లాంటివి మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కమర్షియల్ అంశాలను కోరుకోకుండా, తెలిసిన సందేశాత్మక కథనే మళ్ళీ చూడాలనుకునే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles