Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2256

సమీక్ష : జూబిలీ –అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెబ్ సిరీస్

$
0
0
Jubilee Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: సిద్ధాంత్ గుప్తా, అపరశక్తి ఖురానా, అదితి రావ్ హైదరీ, ప్రోసెంజిత్ ఛటర్జీ, వామికా గబ్బి, రామ్ కపూర్ మరియు ఇతరులు

దర్శకులు : విక్రమాదిత్య మోత్వానీ

నిర్మాతలు: దీపా దే మోత్వానీ

సంగీత దర్శకులు: అలోకానంద దాస్‌గుప్తా

సినిమాటోగ్రఫీ: ప్రతీక్ షా

ఎడిటర్: ఆర్తి బజాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రస్తుతం ఓటిటి లో పలు సినిమాలు అలానే వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని అలరిస్తూ మంచి వ్యూస్ తో కొనసాగుతున్నాయి. ఇక తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు జూబిలీ అనే హిందీ వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చారు. మరి అది ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

హిందీ సినిమా పరిశ్రమ యొక్క ఎదుగుదల 1940-50 ల కాలంలో ఎలా ఉంది అనేది ఐదు పాత్రల ద్వారా ఈ సినిమాలో చూపించడం జరిగింది. వారు శ్రీకాంత్ రాయ్ (ప్రొసెంజిత్ ఛటర్జీ), రాయ్ టాకీస్ అనే సొంతం సినిమా స్టూడియో యజమాని, అతని భార్య మరియు ఒక స్టార్ నటి సుమిత్రా కుమారి (అదితి రావ్ హైదరి), రాయ్ యొక్క విశ్వసనీయ స్టూడియో ల్యాబ్ అసిస్టెంట్ బినోద్ దాస్ (అపర్శక్తి ఖురానా), ఒక నాటక రచయిత మరియు జై ఖన్నా (సిద్ధంత్ గుప్తా) అనే శరణార్థి, నీలోఫర్ (వామికా గబ్బి) అనే వేశ్య. వీరి ద్వారా కథనం ముందుకి ఏవిధంగా సాగింది అనేది సిరీస్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ముఖ్యంగా ఈ సిరీస్ కి ప్రధాన బలం కథ. ఐదు బలమైన పాత్రల ద్వారా అప్పట్లో బొంబాయి ఫిలిం ఇండస్ట్రీని చూపించారు. ప్రతి ఒక్క పాత్ర ద్వారా దర్శకుడు ఆడియన్స్ కి తాను చెప్పదల్చుకుని ఎంతో చక్కగా చెప్పారు. మొత్తంగా స్క్రీన్ టైం తో పనిలేకుండా ఐదు పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ పలు లేయర్స్ గా సాగుతుంది. భారత్, పాకిస్తాన్ విభజన సమయంలో బెంగాల్ మరియు పంజాబ్ సమస్యలపై మరియు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై USSR మరియు USA ప్రభావంపై అంశాలను ఈ సినిమాలో చూపించారు. అలానే 1940-50 ల కాలంలో బాలీవుడ్ కి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇందులో చూపించడం జరిగింది. అప్పటి తారల జీవన శైలి, అఫైర్లు, పైరసీ, రాజకీయాలు వంటి అంశాలు అన్ని కూడా నిశితంగా ఇందులో చూపారు. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఒక్కొక్క పాత్రకు సరైన ఆర్టిస్ట్ ని ఎంచుకోవడం మరొక బలం అనే చెప్పాలి. ఇక ఐదుగురిలో సిద్దాంత్ గుప్తా మరియు అపర్శక్తి ఖురానా స్క్రీన్ టైమ్‌ ఎక్కువ భాగం ఉంది మరియు ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. సిద్దాంత్ గుప్తా పలు సీన్స్ లో అద్భుతమైన నటన కనబరిచారు, మొదటి సీన్ నుండే అతని పాత్రతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అపర్శక్తి ఖురానా పాత్ర మల్టిపుల్ షేడ్స్ కలిగి ఉంటుంది మరియు ఆయన నటన కూడా బాగుంది. నీలోఫర్‌ పాత్రలో వామికా గబ్బి అద్భుతమైన నటన కనబరిచింది, మరియు సిద్ధాంత్ గుప్తాతో ఆమె కెమిస్ట్రీ ఎంతో బాగుంది. అదితి రావ్ హైదరి తన పాత్రలో జీవించారు మరియు కథను ముందుకు నడిపించడానికి ఆమె పాత్రను ఉపయోగపడుతుంది. రాయ్ టాకీస్ యజమానిగా ప్రోసెన్‌జిత్ ఛటర్జీ తన బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీతో పాత్రకు గొప్ప సహజత్వాన్ని తీసుకువచ్చారు. 1940ల కాలం నాటి పరిస్థితులు, వ్యక్తులను ప్రతిబింబించేలా గొప్పగా సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ ని అద్భుతంగా ప్రొడక్షన్ డిజైనర్ డిజైన్ చేసారు, వారికి ఎంత క్రెడిట్ ఇచ్చినా తక్కువే. ఇక హిందీ సినిమా పరిశ్రమ ప్రధానంగా ఆకాలంలో గొప్ప పాటలకు ప్రసిద్ధి చెందింది. అలానే జూబ్లీలీ సిరీస్ లో ఆ గొప్ప సంగీతాన్ని మనం చూడవచ్చు. ప్రతి పాట అద్భుతంగా ఉండడంతో పాటు అత్యద్భుతంగా చిత్రీకరించబడ్డాయి కూడా. కథకు సంబంధించి చాలా అంశాలు జరిగినా, ప్రతి చిన్న అంశాన్ని ఆకట్టుకునేలా ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. కథ చెప్పడంలో ఎలాంటి గందరగోళం లేదు మరియు ఈ సిరీస్ ఖచ్చితంగా బాలీవుడ్ నుండి వచ్చిన అత్యుత్తమమైనది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

 

మైనస్ పాయింట్స్ :

 

ముందుగా ఒకింత స్లో గా సాగడంతో పాటు ప్రధాన పాత్రల యొక్క పరిచయానికి కొంత టైం పడుతుంది. అందుకే ఆడియన్స్ కూడా ప్రధాన పాత్రల ఎంట్రీ కోసం అలానే వారి అద్భుత నటన కోసం మరింత సమయం మాత్రం సహనంగా వేచి చూడాల్సిందే. అయితే సిరీస్ లో జంషెడ్ ఖాన్ పాత్ర యొక్క స్క్రీన్ టైం మరింత ఉంటె బాగుండేదనిపిస్తుంది. సిరీస్ లో ప్రధాన ముఖ్య పాత్ర అయిన జంషెడ్ ఖాన్ ని మరింత ఎక్కువసేపు చూపించేలా డైరెక్టర్ మరిన్ని సీన్స్ రాసుకుంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

 

సాంకేతికంగా జూబిలీ సిరీస్ ఇటీవలి కాలంలో అత్యుత్తమ సిరీస్ లలో ఒకటి అని చెప్పాలి. అలోకానంద దాస్‌గుప్తా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు అద్భుతంగా ఉన్నాయి మరియు కథనంలో చక్కగా ఇమిడిపోయాయి. ప్రతీక్ షా సినిమాటోగ్రఫీ కూడా ఎంతో బాగుంది. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది, కొన్ని పోర్షన్స్ మరికొంత ఎడిట్ చేసి ఉండవచ్చు అనిపిస్తుంది. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ కి పెట్టిన ఖర్చు మనకు కనిపిస్తుంది. అలానే అది స్క్రీన్ పై ఎంతో అందంగా కూడా ఉంటుంది. దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ విషయానికి వస్తే, అతను సిరీస్‌ ని అద్భుతంగా తెరకెక్కించారు అని చెప్పాలి. విక్రమాదిత్య మోత్వానీ ఆకట్టుకునే కథనం అందించడమే కాకుండా, సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చూపించారు. ఆయన తన నటీనటులందరి నుండి అద్భుతమైన నటనను రాబట్టారు. చాలా లేయర్స్ ఉన్న కథను ఇంత అద్భుతంగా చెప్పడంలో దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేశాడు. అలానే అతను అప్పటి బాలీవుడ్ సినిమాని సినీ నటులను పరిస్థితులను ఎంతో సహజంగా చూపించారు.

 

తీర్పు :

 

మొత్తంగా అయితే హిందీ సినిమాల స్వర్ణయుగానికి జూబిలీ సిరీస్ సముచిత నివాళి అందించింది. నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు, బలమైన కథాంశం, గొప్ప నిర్మాణ రూపకల్పన మరియు గొప్ప సంగీతం దీని ప్రధాన బలాలు. కొన్ని సమయాల్లో కథనం నెమ్మదిగా సాగినప్పటికీ, మీరు అప్పటి సినిమా పరిశ్రమ మరియు సినీ ప్రముఖుల గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారైతే, ఈ సిరీస్ మీ వాచ్‌లిస్ట్‌లో ఉండాల్సిందే. మహానటి లాంటి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు కూడా జూబిలీని ఎంతో ఇష్టపడతారు. తప్పకుండా ఈ సిరీస్ ని చూసి ఆనందించండి.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష : జూబిలీ – అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెబ్ సిరీస్ first appeared on .

Viewing all articles
Browse latest Browse all 2256

Trending Articles