Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

సమీక్ష : మనమంతా –జీవితాన్ని పరిచయం చేసే ‘కథలు’!

$
0
0
'Manamantha review

విడుదల తేదీ : ఆగష్టు 05, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : చంద్రశేఖర్ ఏలేటి

నిర్మాత : సాయి కొర్రపాటి

సంగీతం : మహేష్ శంకర్

నటీనటులు : మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పటికప్పుడు విలక్షణమైన కథలను మనకు అందిస్తూ, తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించుకున్నారాయన. ఇక తాజాగా ఆయన మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, నాటితరం స్టార్ హీరోయిన్ గౌతమిలతో కలిసి ‘మనమంతా’ అనే సినిమాతో మనముందుకు వచ్చారు. ఒకే ప్రపంచానికి చెందిన నలుగురి కథల సమాహారంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా చంద్రశేఖర్ ఏలేటి సినిమాల స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

సింపుల్‌గా చెప్పాలంటే ‘మనమంతా’, సాయిరామ్, గాయత్రి, మహిత, అభి అనే నలుగురి కథలను కలుపుతూ చెప్పిన ఓ సినిమా. సాయి రామ్ (మోహన్ లాల్) ఓ పెద్ద రీటైల్ సూపర్ మార్కెట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూంటాడు. ఎప్పటికప్పుడు తన మధ్యతరగతి జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూనే జీవితంలో ఇంకాస్త పైకి ఎదగాలని తపిస్తూ ఉంటాడు. ఇక గాయత్రి (గౌతమి) మధ్యతరగతి జీవితానికి పూర్తిగా అలవాటు పడిపోయిన ఓ గృహిణి. ఏమేం చేస్తే తన భర్త, పిల్లలు సంతోషంగా ఉంటారని ఆలోచిస్తూ ఉండే మనస్థత్వం ఆమెది. అభిరామ్ (విశ్వాంత్) కాలేజీ చదివే ఓ కుర్రాడు. జీవితంలో మంచి స్థాయికి రావాలని చదువుల్లో కష్టపడుతూ ఉండాలన్న ఆలోచన అతడిది. ఇక మహిత (రైనా రావు) కాన్వెంట్‌లో చదివే ఓ అమ్మాయి. తనకు చేతనైనంతలో అడిగిన వారికి సహాయం చేసే మనస్థత్వం మహితది. ఈ నలుగురి జీవితాలూ సాఫీగా సాగిపోతుండగా, వీరి జీవితాల్లో కొన్ని అనుకోని మలుపులు తిరిగి అంతా అస్థవ్యస్థమవుతుంది. ఈ పరిణామాలకు కారణమేంటి? ఈ నలుగురూ ఒకరికొకరు పరిచయమేనా? చివరకు ఈ కథలన్నీ ఎక్కడికి చేరాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెల్సుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథాంశం, స్క్రీన్‌ప్లే అనే చెప్పుకోవాలి. కథాంశం వినడానికి ఎంత సింపుల్‌గా ఉన్నా, ఒక్కసారి పూర్తిగా చూస్తే అందులో ఎంత క్లిష్టమైన ఆలోచనలున్నాయో అర్థమవుతుంది. ఇలాంటి ఆలోచనలన్నింటినీ, నలుగురి జీవితాల్లోని సంఘటనలుగా ఎంతో తెలివిగా, జాగ్రత్తగా ఓ సినిమాగా చెప్పిన విధానాన్ని అభినందించకుండా ఉండలేం. చంద్రశేఖర్ ఏలేటి ప్రతిభ ఈ విషయంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్‌ని సినిమా పరంగా ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అన్నింటికీ మించి ఈ కథలో్ నలుగురికీ ఉన్న కనెక్షన్ ఏంటన్నది చివరివరకూ సస్పెన్స్‌గానే కొనసాగించడం, ఆ సస్పెన్స్‌ను కూడా మంచి ఎమోషనల్ సీన్‌తో రివీల్ చేయడం చాలా బాగుంది.

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్‌కి ఇదే మొదటి పూర్తి స్థాయి తెలుగు సినిమా. నటనలో తన స్థాయి ఏంటన్నది మోహన్ లాల్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం చేశారు. సాయిరాం అనే పాత్రలో సింపుల్‌గా కనిపిస్తూనే ఆ పాత్ర పడే సంఘర్షణను మోహన్ లాల్ చాలా బాగా చూపించగలిగారు. ఇక గౌతమి ఓ గృహిణిగా చాలా బాగా నటించింది. ఆమె డబ్బింగ్ కూడా బాగుంది. విశ్వాంత్ ‘కేరింత’తో పోలిస్తే ఈ సినిమాలో మరింత పరిణతి చూపించాడు. క్లైమాక్స్‌లో అతడి యాక్టింగ్ బాగుంది. మహిత పాత్రలో నటించిన పాప రైనా రావు గురించి ఎంతచెప్పినా తక్కువే. చిన్న చిన్న క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నుంచి ఎంతో క్లిష్టమైన సన్నివేశాల్లోనూ రైనా అవలీలగా నటించేసింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే మేకింగ్ కథ స్థాయికి సరిపడేలా లేకపోవడం గురించి చెప్పుకోవాలి. చంద్రశేఖర్ ఏలేటి గత సినిమాలతో పోలిస్తే ఆయన ఈ సినిమాలో మేకింగ్ పరంగా ప్రయోగాలేవీ చేయలేదన్నది స్పష్టంగా కనిపించింది. ఇక ఫస్టాఫ్‌లో సినిమా ఈ పాత్రల పరిచయం చుట్టూనే తిరిగేది కావడంతో ఇంటర్వెల్ తర్వాతే అసలు కథ మొదలైనట్లు అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ అంశాలనే కోరేవారికి ఈ సినిమాలో ఆ తరహా సన్నివేశాలేవీ లేవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, తానెంత కొత్తగా ఆలోచస్తాడో ఈ సినిమాతో మరోసారి పరిచయం చేశాడు. ఒకే ప్రపంచానికి చెందిన నలుగురి కథలను చెబుతూ, వారి మధ్యన ఉన్న సంబంధం ఏంటో చివరివరకూ చెప్పకుండా ఆయన రాసిన స్క్రీన్‌ప్లే గురించి ఎంతచెప్పినా తక్కువే. ఇది చంద్రశేఖర్ బెస్ట్ స్క్రీన్‌ప్లే అనొచ్చు. ఇక నటీనటుల నుంచి సరైన నటన రాబట్టుకోవడం, సినిమాను ఎక్కడా కమర్షియల్ అంశాల జోలికి పోనివ్వకుండా, పూర్తిగా వాస్తవికతకు దగ్గరగానే నడపడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. మేకింగ్ విషయంలో తన గత సినిమాల తరహాలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా స్థాయి వేరేలా ఉండేది.

మహేష్ శంకర్ అందించిన పాటలు సందర్భానుసారంగా వచ్చేవే కావడంతో పాటు, మంచి ఫీల్ తెచ్చిపెట్టాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగున్నా, కథ, సినిమా స్థాయిలో లేదనే చెప్పాలి. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ ఎస్.రవీంద్ర పనితనాన్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా స్లమ్ ఏరియా నేపథ్యం చూస్తే, ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభను గమనించొచ్చు. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు కథా అవసరానికి తగ్గట్టు బాగున్నాయి.

తీర్పు :

తెలుగు సినిమా నిజ జీవిత కథలను చెప్పడం అరుదుగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో, ఒక సినిమా అచ్చంగా నిజ జీవితాన్నే తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో మరోసారి పరిచయం చేసిన సినిమా ‘మనమంతా’. నలుగురి జీవితాల్లోని సంఘటనలను, వారి ఇష్టాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఒక కథగా చెప్పడం ఈ సినిమా విషయం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక దీనికి మోహన్ లాల్, గౌతమి, విశ్వంత్, నైనాల నటన తోడై ఆ ప్లస్‌పాయింట్‌కు మరింత బలాన్నిచ్చింది. ఫస్టాఫ్‍లో సినిమా కాస్త నెమ్మదిగా నడవడం, మేకింగ్ సాదాసీదాగా ఉండడం లాంటి మైనస్‌లను పక్కనబెడితే ఈ సినిమా కచ్చితంగా ఓ మంచి అనుభూతినిచ్చే సినిమాగా నిలుస్తుందనే చెప్పొచ్చు. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా, ఒక రియలిస్టిక్ సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న నిర్మాత సాయి కొర్రపాటి ఆలోచనను కూడా అభినందించాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే.. జీవిత కథలను వాస్తవికతకు దూరం జరపకుండా చెబితే ఎప్పటికీ బాగుంటాయని ఋజువు చేస్తూ, జీవితాన్ని మరోసారి కొత్తగా పరిచయం చేసే సినిమా ‘మనమంతా’!

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2258

Trending Articles