
విడుదల తేదీ : మే 26, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : కిషోర్
నిర్మాత : కిషోర్
సంగీతం : మధు పోనుస్
నటీనటులు : కృష్ణ చైతన్య, రాజేష్ రాథోడ్, షాలు, మౌనిక
బిగ్ విగ్ బ్యానర్ లో కృష్ణ చైతన్య, రాజేష్ రాథోడ్, షాలు, మౌనిక జంటలుగా కిశోర్, దర్శక నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ఓ పిల్లా నీ వల్ల. రెండు ప్రేమ జంటల మధ్య సాగే కథతో పాటు ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన హీరో హీరోయిన్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
రాజేష్ అనే అబ్బాయి తన క్లాస్ మెట్ అయిన అవంతిక (మౌనిక) ను ఇష్టపడతాడు. అవంతిక కూడా రాజేష్ ని ఇష్టపడుతుంది కానీ బయటకి చెప్పకుండా మనసులోనే దాచుకుంటుంది. చివరికి ఒకరోజు రాజేష్, అవంతిక కలుసుకొని ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకోవాలని అనుకుంటారు. ఇంతలో మరో కుర్రాడు కృష్ణ చైతన్య తన స్నేహితురాలు నేహా (షాలు) విషయంలో రాజేష్ ను అపార్థం చేసుకుని అతన్ని కొడతాడు.
ఆ సంఘటనతో రాజేష్ ను అవంతికను అపార్థం చేసుకుని వెళ్ళిపోతుంది. అలా కృష్ణ చైతన్య కారణంగా విడిపోయిన రాజేష్, అవంతికలు మళ్ళీ కలుసుకున్నారా ? కృష్ణ చైతన్య తన తప్పును తెలుసుకున్నాడా లేదా ? రాజేష్, కృష్ణ చైతన్యల మధ్య వైరం వారి జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పింది ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో బలమైన అంశాలు ఏవైనా ఉన్నాయంటే అది కాస్త వైవిధ్యంగా ఉన్న కథ ఒక్కటే అని చెప్పుకోవాలి. రెగ్యులర్ లవ్ స్టోరీస్ లా కాకుండా కథలో కొంత వరకు కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు చిత్ర దర్శకుడు. పాటలు కూడా బావున్నాయి. ఇక నటి నటులు కూడా తమ పాత్రల వరకు బాగానే నటించారు. ఇంటర్వెల్ తర్వాత చిత్ర కథ నాయకుల మధ్య వచ్చే సీన్స్ పర్వాలేదు అని చెప్పొచ్చు. కానీ కొన్ని సీన్లలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బావుండేది.
ఫస్ట్ హాఫ్లో, సెకండాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. అవి సినిమాను కొంతవరకు కాపాడాయనే చెప్పాలి. చివరి క్లైమాక్స్ లో దర్శకుడు కొత్త తరహా స్క్రీన్ ప్లే ట్రై చేశాడు. కానీ అందులో కొంచెం కష్టపడి ఉండే సినిమా మరో రేంజ్ లో ఉండేది. ఇక ఇద్దరు కథ నాయకులు మొదటి సినిమానే అయినా డాన్సులతో కొంత వరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో స్క్రీన్ ప్లే లో పట్టు లేకపోవడం చిత్రానికి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. రెండు ప్రేమ కథల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో తారల మద్య సన్నివేశాలు పూర్తి స్థాయిలో అర్ధం కావు. రెండు ప్రేమ జంటల మధ్య ఒకేసారి నడిచే లవ్ సీన్లు కొంచెం కన్ఫ్యూజన్ కు గురిచేస్తాయి. ఇక దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగానే ఉన్నా సినిమా నిడివి కాస్త ఎక్కువవ్వడంతో చూస్తున్నవారికి అసహనాన్ని తెప్పిస్తుంది.
సెకండాఫ్లో ఇద్దరు హీరోల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నా ఇంకొన్ని మాత్రం చాలా విసిగించాయి. పాటలు చిత్రీకరణ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు కిషోర్ తానే నిర్మాత బాద్యతలను స్వీకరించి తెరకెక్కించిన తన మొదటి చిత్రంతో పరవాలేదు అనిపించాడు. కానీ కొన్ని సీన్లలో నటి నటులను ఇంకాస్త బెటర్ గా వాడుకుని ఉంటే బావుండేది. చిత్రంలో సన్నివేశాలేమైనా అయినా బావున్నాయి అంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ షోయబ్ కి చెందుతుంది. కొన్ని యాక్షన్ సీన్స్ లో కెమెరా పనితనం చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ మధు కూడా రెండు పాటలను చాలా బాగా కంపోస్ చేశాడు. అలాగే హీరోల మధ్య వచ్చే కొన్ని సీన్లకు బీజీఎమ్ చాలా ఆకట్టుకుంటుంది. లొకేషన్ లు కూడా బావున్నాయి. ఎడిటర్ అనిల్ ఇంకాస్త సినిమా నిడివిని తగ్గించి ఉంటే బావుండేది.
తీర్పు :
ఓ పిల్ల నీ వల్ల చిత్రంలోని ప్రధాన నటి నటులతో పాటు సాంకేతిక విభాగం కూడా కొత్త వారే అయినా సినిమాను కష్టపడి తీశారని అర్ధమవుతుంది. దర్శకుడు అక్కడక్కడ కొన్ని సీన్లతో , మ్యూజిక్ తో, కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే నరేషన్ చాలా నిదానంగా ఉండడం మరియు బోరింగ్ ఫస్ట్ హాఫ్ చిత్రానికి పెద్ద మైనస్. రెండవ అర్ధ భాగం బాగుండటం, హీరోల మధ్య సాగే సన్నివేశాలు ఈ చిత్రానికి కాస్త సహాయపడ్డాయి. కానీ కాస్త కన్ఫ్యూజన్ క్లైమాక్స్ లో కొన్ని సీన్లు చిరాకు తెప్పిస్తాయి. సినిమా మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా కొంచెం కన్ఫ్యూజన్ కు గురిచేసే స్క్రీన్ ప్లే ను తట్టుకోగలిగితే ఈ సినిమా కాస్త బెటర్ గా అనిపించవచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team