Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2263

సమీక్ష : నిన్ను కోరి –మెచ్యూర్డ్ లవ్ స్టోరీ

$
0
0
Ninnu Kori movie review

విడుదల తేదీ : జూలై 7, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : శివ నిర్వాణ

నిర్మాత : డి.వి.వి దానయ్య

సంగీతం : గోపి సుందర్

నటీనటులు : నాని, నివేత థామస్, ఆది పినిశెట్

ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పు పొందుతూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న హీరో నాని చేసిన భిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనరే ‘నిన్ను కోరి’. నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ లవ్ స్టోరీతో నాని ఎంతవరకు మెప్పించాడో ఇప్పుడు చూద్దాం…

కథ :

వైజాగ్లో పి.హెచ్.డి చేసే యువకుడు ఉమా మహేశ్వరరావ్ (నాని), పల్లవి (నివేతా థామస్) ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఉమాను ప్రేమిస్తుంది. ఇంతలోనే పల్లవికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. దీంతో పల్లవి, ఉమాతో వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ ఉమా మాత్రం లైఫ్లో సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కెరీర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఢిల్లీ వెళ్ళిపోతాడు.

ఇంతలో పల్లవి తండ్రి ఆమె మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోకుండా ఆమెకు అరుణ్ (ఆది పినిశెట్టి) తో వివాహం నిశ్చయం చేస్తాడు. పల్లవి కూడా తన ప్రేమను తండ్రికి చెప్పలేని స్థితిలో అరుణ్ ను వివాహం చేసుకుంటుంది. అలా విడిపోయిన ఉమా, పల్లవిల జీవితాలు, ఉమాను ప్రేమించిన పల్లవిని పెళ్లి చేసుకున్న అరుణ్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? చివరికి సుఖాంతమయ్యాయ లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు శివ నిర్వాణ కథను క్లిస్టర్ క్లియర్ గా రాసుకోవడంతో సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కన్ఫ్యూజన్ అనేదే కలుగలేదు. ఆ కథ కూడా రొటీన్ లవ్ స్టోరీల్లా కాకుండా కొంచెం కొత్తగా, మెచ్యూర్డ్ గా ఉంది. ప్రేమించే పెళ్లి చేసుకోనక్కర్లేదు పెళ్లి చేసుకుని కూడా ప్రేమించువచ్చు, ఒకసారి ప్రేమలో విఫలమైతే జీవితం ఇంకో ఛాన్స్ ఇస్తుంది వంటి వాస్తవాల్ని దర్శకుడు సున్నితంగా చెప్పాడు. సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఎవరో ఒకరు త్యాగానికి పూనుకుని కథ చివర్లో కొంత బాధను మిగల్చడం పరిపాటి. కానీ ఈ సినిమా ముగింపు మాత్రం అలా కాకుండా ప్రేక్షకుడు ఓకే అనుకునేలా ఉండటం బాగుంది.

ఇక సినిమాకు మరొక ప్రధాన ప్లస్ పాయింట్ హీరో నాని. అక్కడక్కడా మంచి టైమింగ్ తో పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేసిన నాని సెకండాఫ్లోని ముఖ్యమైన ఎమోషనల్ సీన్లలో ఎక్కువ తక్కువలు లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను కనబర్చాడు. అంతేగాక ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకున్నా ఎలాగోలా తిరిగి తనకు దక్కకపోతుందా అనే చిన్న ఆశను, స్వార్థాన్ని కలిగిన ప్రేమికుడిగా అలరించాడు.

హీరోయిన్ నివేతా థామస్ తనకు దూరమైన ప్రేమికుడు నాశనమైపోకూడదని తపనపడే ప్రేయసిగా, తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నోప్పించకూడదు అని ఆలోచించే భార్యగా తన నటనతో ఆకట్టుకుంది. ఇక మరొక ముఖ్యమైన పాత్ర చేసిన ఆది స్క్రిప్ట్ కు తగ్గట్టు సహజంగా నటించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురు కథకు నేచ్యురల్ అప్పియరెన్స్ తీసుకొచ్చి సినిమాను ప్రేక్షకులకు కనెక్టయ్యేలా చేశారు. అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన మురళి శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్విలు మధ్య మధ్యలో నవ్విస్తూ అలరించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో రొమాంటిక్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్ మాత్రమే ఉండటంతో రెగ్యులర్ మాస్, కామెడీ ఎంటర్టైనర్లను కోరుకునే సింగిల్ స్క్రీన్ ఆడియన్సును ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించకపోవచ్చు. పైగా పాత్రల తీరును కూడా మెచ్యూర్డ్ గా ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉండటం, కథ కొంచెం మాడరన్ జనరేషన్ కోసమే అనేలా ఉండటం వలన కూడా బి, సి సెంటర్ల ఆడియన్స్ పూర్తి స్థాయిలో సినిమాకు కనెక్టవకపోవచ్చు.

క్లైమాక్స్ లో ఎమోషన్ ఉన్నా అది ఎక్కువసేపు ప్రేక్షకుడి మైండ్లో నిలబడే విధంగా లేకపోవడంతో ఈ బరువు సరిపోదు, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. సినిమా మొత్తం ఫస్టాఫ్ గాని, సెకండాఫ్ గాని బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు లేకుండా ఫ్లాట్ గా వెళ్లిపోవడంతో ఎక్కడా పెద్దగా ఎగ్జైట్మెంట్ కలగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎలాంటి ఎత్తు పల్లాలు లేని రోడ్డు మీద సైలెంట్ గా జర్నీ చేస్తున్నట్టు అనిపించింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శివ నిర్వాణ చేసింది మొదటి సినిమానే అయినా పరిణితి కనబర్చాడు. అనుభవ లేమి కారణంగా దొర్లే తప్పులు పెద్దగా లేకుండా జాగ్రత్తగా సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేసి వాస్తమైన అంశాలని గుర్తుచేశాడు. కానీ స్క్రీన్ ప్లే మొత్తం చాలా ఫ్లాట్ గా రాసుకోవడంతో ప్రేక్షకుడ్ని టచ్ చేసే బలమైన సన్నివేశాలు ఎక్కడా కనబడలేదు.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చిత్రానికి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. సినిమాలో అమెరికా పరిసరాల్ని చాలా అందంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ క్రిస్టల్ క్లియర్ గా కనిపించేలా చేసి సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చాడు. గోపి సుందర్ సంగీతం బ్రేకప్, అడిగా అడిగా వంటి పాటల్లో మాత్రమే బాగుందనిపించింది. ఎడిటింగ్ బాగుంది. డి. వి. వి దానయ్య పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

తీర్పు :

ఈ ‘నిన్ను కోరి’ ప్రస్తుత కాలానికి, జనరేషన్ కు తగిన మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. వాస్తవానికి దగ్గరగా ఉండే కథ, అందులోని పాత్రలు, మంచి నటన కనబర్చిన నటీనటులు, శివ నిర్వాణ స్టోరీని చెప్పిన విధానం, మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా ఎమోషన్ తగ్గిన క్లైమాక్స్, ఎక్కడా ఎగ్జైట్మెంట్ కు గురిచేసే సన్నివేశాలు లేకపోవడం, నెమ్మదైన స్క్రీన్ ప్లే, పరిణితితో ఆలోచించి అర్థం చేసుకోవలసిన కథ కావడం రెగ్యులర్ ఆడియన్సును నిరుత్సాహానికి గురిచేసే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే కొంచెం నెమ్మదైన స్క్రీన్ ప్లే ను తట్టుకునే, భిన్నమైన ప్రేమ కథను చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2263

Latest Images

Trending Articles



Latest Images