Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష : ఫిదా –ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టొరీ!

$
0
0
Fidaa movie review

విడుదల తేదీ : జూలై 21, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : శేఖర్ కమ్ముల

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : శక్తి కాంత్

నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి

శేఖర్ కమ్ముల సినిమా అంటే యూత్ లో ఓ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన గత సినిమాలు ఓ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అయితే తరువాత వచ్చిన కొన్ని సినిమాలు నిరుత్సాహ పరిచిన మరల చాలా గ్యాప్ తీసుకొని మెగా హీరో వరుణ్ తో దిల్ రాజు బ్యానర్ లో శేఖర్ చేసిన సినిమా ఫిదా ప్రేక్షకులని ఎ స్థాయిలో ఆకట్టుకుందో ఓ సారి తెలుసుకుందాం.

కథ :
అమెరికాలో డాక్టర్ గా పని చేసే వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్యకి పెళ్లి సంబంధం కోసం తెలంగాణ లో బాన్సువాడకి వస్తారు. అక్కడ వరుణ్ అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి భానుమతి(సాయి పల్లవి) అని ఓ చెల్లి ఉంటుంది. ఆమె చేసే అల్లరితో ఆ పెళ్లిలో వరుణ్, భానుమతి అనుకోకుండా ఒకరికి ఒకరు తెలియకుడా ప్రేమలో పడతారు. అయితే అనుకోని పరిస్థితిలో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. దీంతో ఇద్దరు ఒకరిని ఒకరు ద్వేచించుకునే వరకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ మధ్య మనస్పర్ధలకి అసలు కారణం ఏమిటి? మరల వరుణ్, భానుమతి ఇద్దరు ఎలా ఒకటయ్యారు? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి. తన పెర్ఫార్మెన్స్ తో థియేటర్ లో అందరిని కట్టిపడేసింది. ప్రతి చిన్న ఎమోషన్స్ కి కూడా అద్బుతంగా చూపిస్తూనే, కుటుంబం, ప్రేమ అనే బంధాల మధ్య నలిగిపోయే ఓ మామూలు అమ్మాయి పాత్రలో ఆ సంఘర్షణని భాగా చూపించింది. ఇక ఆమె కామెడీ టైమింగ్, తెలంగాణా యాసలో ఆమె సంభాషణలు పలికే విధానం. డాన్స్ ఇలా అన్నింటా టాప్ అనిపించుకొని సినిమా రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఇక సినిమా ఆద్యంతం ప్రేక్షకులని అలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. అచ్చం మన ఇంట్లో, మన ఊరిలో ఉన్న ఫీలింగ్ లా ఫస్ట్ ఆఫ్ అంతా ఉంటుంది.

ఇక నటీనటుల విషయంకి వస్తే ఈ సినిమాకి మేజర్ ప్లస్ సాయి పల్లవి. వరుణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో అతని పెర్ఫార్మెన్స్ విషయంలో కాస్తా వంకలు పెట్టేవారు. ఈ సినిమాలో అతను తన యాక్టింగ్ టాలెంట్ పీక్ లో చూపించాడు. ఇక హీరోయిన్ తండ్రిగా చాలా ఏళ్ల తర్వాత నటించిన సీనియర్ నటుడు సాయిచంద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా వారి పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మైనస్ పాయింట్స్ అంటే ముందుగా సినిమాలో చెప్పుకోవడానికి అసలు కథ లేకపోవడం. శేఖర్ కమ్ముల అన్ని సినిమాల తరహాలోనే ఇందులో కూడా ఇలాంటి కథ ఉండదు. కేవలం చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలు, భావోద్వేగాలతో కథని నడిపించారు. ఇక మొదటి సగ భాగం చూసిన తర్వాత రెండో సగ భాగంలో ఆడియన్స్ ఇంకాస్తా ఎక్కువ ఊహిస్తాడు. అయితే సెకండ్ హాఫ్ ఆడియన్స్ అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. లవ్ స్టొరీ, ఎంటర్ టైన్మెంట్ మొత్తం ఫస్ట్ హాఫ్ కి పరిమితం అయిపోవడంతో సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఫైనల్ గా హీరో తన ప్రేమని సొంత చేసుకునే విధానం అంత కన్విన్సింగ్ గా లేనట్లు అనిపిస్తుంది. అలాగే సినిమాలో మెయిన్ కాస్టింగ్ తప్ప మిగిలిన వారిలో చాలా మంది కొత్త మొహాలు కనిపించడం కాస్తా రెగ్యులర్ ఆడియన్స్ కి ఇబ్బందిగ అనిపించిన, శేఖర్ కమ్ముల సినిమాలు ఫాలో అయ్యేవారికి ఒకే.

సాంకేతిక విభాగం :

దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలో ఆద్యంతం కనిపిస్తాయి. ఇక దర్శకుడుగా శేఖర్ కమ్ముల ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఫిదా కాస్తా ప్రత్యేకం అనే చెప్పాలి. అతని స్టైల్ అఫ్ మేకింగ్ చూపిస్తూ, డైలాగ్స్, ఎమోషన్స్ ని చూపించడంలో తన మార్క్ మరల రిపీట్ చేసాడు అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ అందించిన పాటలు చాలా కాలం పాటు జనాల నోట్లో నానుతూనే ఉంటాయి. అంత బాగా స్వరాలు సమకూర్చారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్ని ఎమోషన్స్ కి తగ్గట్టు అందించి సినిమాకి అదనపు బలం తీసుకోచ్చారు.

ఇక కెమెరా మెన్ ఫోటోగ్రఫి చాలా బాగుంది. ఇప్పటి వరకు పల్లెటూరి వాతావారణం అంటే గోదావరి ప్రాంతం అందాలే తెలుగు సినిమాలో కనిపించేవి. ఇప్పుడు తెలంగాణలో కూడా పల్లెలు ఇంత అందంగా ఉంటాయా అనేట్టు చూపించాడు. ఇక అమెరికా అందాలు కూడా ఫోటోగ్రఫితో భాగా బందించి ప్రేక్షకులకి ఆహ్లాదం అందించాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా భాగానే ఉంది. ఇక పాటలు సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని పాటలు కూడా సాహిత్యం పరంగా భాగా మెప్పించాయి.

తీర్పు :

శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎలాంటి ఎమోషన్స్ ఆశించి ప్రేక్షకులు వెళ్తారో అవన్నీ సినిమాలో ఉంటాయి. ఇక దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుందని నమ్మకం మరో సారి రుజువైంది. ఇక ఇప్పటి వరకు మలయాళీలో సాయి పల్లవిని చూసిన వారికి ఆమె గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేకపోయిన, అసలు ఆమెకి ఎందుకు అంత ఫాలోయింగ్ ఉందో ఈ సినిమా చూస్తే అర్ధమైపోతుంది. అంతగా ఆమె ప్రేక్షకులని కట్టిపడేసింది. ఇక వరుణ్ తేజ్ కూడా గత సినిమాలని మించి తన మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటాడు. సినిమాకి పాటలు మరో అదనపు బలం. ఒక్క మాటలో సినిమా గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ఫిదా.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles