Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష : నీవెవరో –సస్పెన్స్‌ గా సాగని థ్రిల్లర్‌

$
0
0
 Neevevaro movie review

విడుదల తేదీ : ఆగష్టు 24, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఆది పినిశెట్టి హీరోగా, తాప్సీ పన్ను, రితికా సింగ్‌, వెన్నెల కిషోర్ తదితరులు

దర్శకత్వం : హరి నాధ్

నిర్మాతలు : యమ్.వి.వి సత్య నారాయణ

సంగీతం : అచ్చు రాజమని. ప్రసన్న

సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్

స్క్రీన్ ప్లే : కోన వెంకట్

ఎడిటర్ : ప్రదీప్ రాఘవ్

ఆది పినిశెట్టి హీరోగా, తాప్సీ పన్ను, రితికా సింగ్‌ ముఖ్య పాత్రల్లో వచ్చిన థ్రిల్లర్‌ చిత్రం ‘నీవెవరో’. రంగస్థలం తర్వాత ఆది నటిస్తోన్న చిత్రం కావటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ ట్రైలర్ లతోనే ప్రేక్షకుల్లో మంచి బజ్ సృష్టించుకుంది. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
కళ్యాణ్ (ఆది పినిశెట్టి) బ్లైండ్ అయినప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. తనకి చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయిన అను(రితికా సింగ్) కళ్యాణ్ ను ప్రేమిస్తూ తననే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో కళ్యాణ్ కి వెన్నెల (తాప్సి పన్ను) పరిచయం అవుతుంది, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇక ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు అనుకుంటున్న సమయంలో.. వెన్నెలకి ఓ సమస్య వస్తుంది. కళ్యాణ్ వెన్నెల సమస్య తీర్చే ప్రాసెస్ లో యాక్సిడెంట్ అయి మూడు వారాలు పాటు స్పృహ కొల్పాతాడు. కానీ ఆ యాక్సిడెంట్ తర్వాత కళ్యాణ్ కి కళ్ళు వస్తాయి. కానీ వెన్నెల మిస్ అవుతుంది.

ఆమెను వెతికే క్రమంలో కళ్యాణ్ కి అంతా మిస్టరీగా ఉంటుంది. వెన్నెల గురించి ఊహించని నిజాలు తెలుస్తాయి ? ఆ నిజాలు ఏమిటి ? అసలు వెన్నెల ఎవరు ? కళ్యాణ్ కి వెన్నెల కనిపిస్తోందా ? తను ఏమైపోతుంది ? వెన్నెల గురించి తెలుసుకోవటానికి ‘అను’ కళ్యాణ్ కి ఎలా సాయపడింది ? చివరకి అను, కళ్యాణ్ ఒకటవుతారా ? లాంటి విషయాలు తెలియాలంటే ‘నీవెవరో’ చిత్రం చూడాలసిందే.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ అనే బ్లైండ్ క్యారెక్టర్ లో నటించిన ఆది పినిశెట్టి అచ్చం ఓ బ్లైండ్ లాగే నటించి మెప్పించాడు. లుక్స్ పరంగా పెర్ఫామెన్స్ పరంగా ఆది నటనలో తన మార్క్ చూపిస్తాడు. వెన్నెల (తాప్సి)తో ప్రేమలో పడే సన్నివేశాల్లో మరియు ప్రేమించిన అంమ్మాయి కోసం వెతికే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో ఆదిని సిన్సియర్ గా ప్రేమించే ‘అను’ పాత్రలో కనిపించిన రితికా సింగ్ చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తూనే.. ప్రేమించిన వాడు దూరం అవుతున్నాడనే బాధలో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో ప్రధాన పాత్ర తాప్సి నటించిన వెన్నెల పాత్ర. కథ మొత్తం వెన్నెల చుట్టే తిరుగుతుంది. అలాంటి వెన్నెల పాత్రలో తాప్సి అద్భుతంగా నటించింది. ఒకే పాత్రలో భిన్నమైన భావోద్వేగాలు పండించి తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

ఇక ఇతర పాత్రల్లో కనిపించిన తులసి, శివాజీ రాజా, ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పిస్తారు. ముఖ్యంగా హీరోకి తల్లి పాత్రలో నటించిన తులసి చాలా బాగా నటించారు.

కోన వెంకట్ అండ్ టీమ్ రాసుకున్న కథ మరియి తాప్సి పాత్రే ఈ సినిమాకు ప్రధాన బలం. దర్శకుడు హరి నాధ్ కూడా ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో చెప్పాలనుకున్న క్యారేకరైజేషన్స్ మరియు మెయిన్ థీమ్ తో పాటుగా కొన్ని సప్సెన్స్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శక రచయితలు రెండువ భాగం కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా రెండువ భాగంలో ఉత్సుకతను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నప్పటికీ సింపుల్ గానే కథనాన్ని నడపడం అంతగా రుచించదు.

మొదటి భాగం మెయిన్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సస్పెన్స్ ను బాగా మెయింటైన్ చేసి.. సెకెండాఫ్ లో ఒక్కసారిగా కామెడీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో సినిమా కొంత ట్రాక్ తప్పుతుంది. పైగా వెన్నెల కిషోర్ మరియు సప్తగిరి కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది గాని, బాగా నవ్వించిన సందర్భాలు తక్కువ. ఇలాంటి కామెడీ పెట్టి మంచి టెన్షన్ అండ్ సస్పెన్స్ తో నడిచే సినిమాని డిస్టర్బ్ చేసారని అనిపిస్తోంది.

ఇక కథకే కీలక పాత్ర అయిన ‘వెన్నెల’ పాత్ర గురించి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. చివర్లో మాటల రూపంలో ఆమె గురించి చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ పాత్ర అలా మారడానికి సంఘనటల రూపంలో ఉండి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

కోన వవెంకట్ మరియు హరి నాధ్ రచయితగా దర్శకుడిగా ఈ ‘నీవెవరో ‘ చిత్రానికి దాదాపుగా పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సంగీత దర్శకులు అచ్చు రాజమణి,ప్రసన్న అందించిన సంగీతం బాగుంది. తాప్సి పాత్రను ఎలివేట్ చేసే పాట బాగా ఆకట్టుకుంటుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి.

ఇక ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో పేలని కామెడీ సన్నివేశాలను, కథకు అక్కర్లేని సీన్స్ ను తొలిగించి ఉంటే బాగుండేది . సినిమాలోని కోన వెంకట్ మరియు యమ్.వి.వి సత్యనారాయణ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు :

వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ఇష్టపడే ఆది పినిశెట్టి, తాప్సి కలయికలో కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన ‘నీవెవరో’ చిత్రం ప్రేక్షకుల్లకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది. అయితే సెకండాఫ్ నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు, అక్కడకడ పేలని కామెడీ సీన్స్ సినిమాకి బలహీనతలుగా మిగులుతాయి. మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారితో పాటు కమర్షియల్ చిత్రాలు ఇష్టపడేవారికి కూడా ఈ చిత్రం మంచి చాయిస్ అని చెప్పొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles