Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2268

సమీక్ష : అరవింద సమేత –ఎమోషనల్ గా సాగే యాక్షన్ డ్రామా

$
0
0
Aravinda Sametha movie review

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : ఎన్టీఆర్, పూజా హెగ్డే, సునీల్, జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా, రావు రమేష్ తదిత‌రులు.

దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత : కె రాధకృష్ణన్

సంగీతం : యస్ తమన్

సినిమాటోగ్రఫర్ : పి.యస్ వినోద్

స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ శ్రీనివాస్

ఎడిటర్ : నవీన్ నూలి

స్టంట్స్ : రామ్ లక్ష్మణ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ : 

బసి రెడ్డి (జగపతి బాబు), నారప రెడ్డి (నాగ బాబు ) ఇద్దరు వారి ఫ్యాక్షన్ గ్రూప్ లకు నాయకత్వం వహిస్తారు. ఈ రెండు వర్గాలు పగలు ప్రతీకారాలతో రగిలిపొతుంటాయి. ఈ క్రమంలో అక్కడి ఫ్యాక్షన్ గొడవల వల్ల నారప రెడ్డి చనిపోతాడు. తన తండ్రి చావుతో కత్తి పట్టిన వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్).. ఆ తరువాత తీవ్రంగా నష్టపోయిన అక్కడి కుటుంబాలను చూసి తనలో మార్పు వస్తోంది. ఎలాగైనా ఈ రెండు వర్గాల మధ్య గొడవలు లేకుండా ఆ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో వీర రాఘవ అనుకున్నది సాధించాడానికి ఎం చేసాడు ? ఆ ప్రాసెస్ లో హీరోయిన్ పూజా హెగ్డే ఎన్టీఆర్ కి ఎలా ఉపయోగ పడింది ? చివరకి ఎన్టీఆర్ ఆ ప్రాంతాన్ని మారుస్తాడా ? మారిస్తే ఎలా మారుస్తాడు అనేదే మిగితా కథ.

 

ప్లస్ పాయింట్స్ : 

టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకువెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో పాటు చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ఇక ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాలా.. కానీ గత చిత్రాల్లో కంటే, ఈ చిత్రంలో ఇంకా చాలా బాగా చేశాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

సినిమాలో కీలక పాత్ర అయిన ‘అరవింద’ పాత్రలో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. అలాగే మరో హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఉన్నంతలో చాలా చక్కగా నటించింది.

అత్యంత క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ గా నటించిన జగపతి బాబు తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మరో ముఖ్య పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన రావు రమేష్, సితార, రవి ప్రకాష్, శతృ ఎప్పటిలాగే తమ నటనతో ఆకట్టుకుంటారు.

రాయలసీమ నేపథ్యంలో ఇదివరకు ఎవరూ టచ్ చెయ్యని థీమ్ తో త్రివిక్రమ్ రాసిన కథ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. త్రివిక్రమ్ ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. ప్రతికార చర్యల వల్ల కోల్పోయిన జీవితాల్ని.. ఆ జీవితాల పై ఆధారపడ్డ నమ్ముకున్న బతుకుల బాధలను వారి బావోద్వేగాలను.. హృదయానికి హత్తుకున్నేలా చాలా చక్కగా చూపించారు.

 

మైనస్ పాయింట్స్ : 

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు త్రివిక్రమ్ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు.

సినిమా ఓపెనింగ్ నే యాక్షన్ సీక్వెన్స్ తో మంచి ఎమోషనల్ గా ఓపెన్ చేసిన దర్శకుడు.. దాన్ని కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు.

ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపారు. దీనికి తోడు లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆసక్తికరంగా సాగదు.

 

సాంకేతిక విభాగం : 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. త్రివిక్రమ్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే..బాగుండేది.

సంగీత దర్శకుడు యస్ తమన్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా పెనివిటీ పాట తమన్ కెరీర్ లో చెప్పుకోతగ్గ పాటగా నిలిచిపోతుంది. త్రివిక్రమ్ స్క్రీన్ పై ఆ పాటను తెరకెక్కించిన విధంగా బాగా ఆకట్టుకుంటుంది. రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ని ఇస్తాయి. పి.యస్ వినోద్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు.

ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత కె రాధకృష్ణన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు : 

ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు త్రివిక్రమ్ రాయలసీమ నేపథ్యంలో ఇదివరకు ఎవరూ టచ్ చెయ్యని థీమ్ బేస్ చేసుకొని రాసిన కథతో, బలమైన పాత్రలతో ఆకట్టుకున్నప్పటికి.. కొన్ని సన్నివేశాలను మాత్రం నెమ్మదిగా నడిపించారు. త్రివిక్రమ్ శైలి కామెడీ కూడా లేకపోవడం.. లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం సినిమాని బలహీనపరుస్తాయి. అయితే ఎన్టీఆర్ తన నటనతో తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

Click here for English Review

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team


Viewing all articles
Browse latest Browse all 2268

Latest Images

Trending Articles



Latest Images