
విడుదల తేదీ : జూలై 26, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2 /5
నటీనటులు : హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్ తదితరులు
దర్శకత్వం : రామ్ కుమార్
నిర్మాతలు : సుక్రి కుమార్
సంగీతం : ఆశ్రిత్
సినిమాటోగ్రఫర్ : ఎ. శ్రీకాంత్ (బి.ఎఫ్.ఎ)
దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో హర్షిత్ హీరోగా శ్రీపద్మ హీరోయిన్ గా ఓ.యస్.యం విజన్ మరియు దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
ఈశ్వర్ (హర్షిత్) ఒక అనాధ. వీడియో ప్రొడక్షన్ హౌస్ నడుపుతుంటాడు. అయితే తొలి చూపులోనే పార్వతి (శ్రీపద్మ)తో ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడుతూ ఎట్టకేలకూ ఆమెను కూడా ప్రేమలో పడేస్తాడు. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఈశ్వర్ ను చంపటానికి ఓ గ్యాంగ్ ఎటాక్ చేస్తోంది. ఆ తరువాత జరిగిన సంఘటనల తరువాత ఈశ్వర్ తప్పిపోయాడని పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేస్తోంది. ఆ క్రమంలో సిఐ సలీమ్ దర్యాప్తులో ఈశ్వర్ నలుగురిని హత్య చేసినట్లు తేలుతుంది. అలాగే బతికి ఉన్న ఈశ్వర్ తాను కూడా చనిపోయినట్లు వాదిస్తుంటాడు. అసలు ఈశ్వర్ కి ఏమైంది ? బతికి ఉండి కూడా చనిపోయానని ఎందుకు అనుకుంటున్నాడు ? ఇంతకీ ఈశ్వర్ మీద ఎటాక్ చేసిన గ్యాంగ్ ఎవరు ? ఫైనల్ గా ఈశ్వర్ – పార్వతి పెళ్లి చేసుకున్నారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
వినూత్నమైన కాన్సెప్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నటించిన హర్షిత్ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ అలాగే యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక హర్షిత్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రీపద్మ కూడా అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. సినిమాలో లవర్స్ గా కనిపించిన హర్షిత్ – శ్రీపద్మ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో చాల బాగా నటించారు. అలాగే తమ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించారు.
అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు రామ్ కుమార్ తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది. ఆయన రాసుకున్న కొన్ని సన్నివేశాలు కూడా బాగానే అలరిస్తాయి. అలాగే ఆయన హీరోహీరోయిన్లకు ఆయన పెట్టిన కొన్ని మ్యానరిజమ్స్ అదేవిధంగా ఆయన రాసిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సైకలాజికల్ థ్రిల్లర్ అంటే ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని లవ్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు రామ్ కుమార్ సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. ఎడిటర్ అనవసరమైన సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
పైగా సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. అయితే దర్శకుడు ఇద్దరి మధ్య ప్రేమను బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. పాత్రల మధ్య సంఘర్షణ మాత్రం ఆ ప్రేమ స్థాయిలో లేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.
మొత్తంగా సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. స్క్రిప్ట్ వీక్ గా ఉండటం కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే సినిమాలో దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నా.. సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతున్న ఫీలింగ్ కలగదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు ఆశ్రిత్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. అయితే ప్రీ ఇంటర్వెల్ లో స్మశానంలో వచ్చే ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది.
కానీ ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకు చాలా ప్లస్ అయ్యేది. ఇక ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగానే సాగింది. అయితే కొన్ని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత సుక్రి కుమార్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.
తీర్పు :
దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో హర్షిత్ – శ్రీపద్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో పర్వాలేదనిపించినా.. ఆసక్తికరంగా మాత్రం సాగదు. కాకపోతే హర్షిత్ – శ్రీపద్మ ప్యూర్ లవర్స్ గా తమ పాత్రల్లో ఒదిగిపోవడం, తమ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించడం, దర్శకుడు తీసుకున్న కథాంశం వంటి అంశాలు బాగున్నాయి. అయితే కథాకథనాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team