Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

సమీక్ష : మామాంగం –అంచనాలు అందుకోలేకపోయిన మమ్ముట్టి భారీ చిత్రం

$
0
0
 Mamangam review

విడుదల తేదీ : డిసెంబర్  12, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  మమ్ముట్టి, ఉన్ని ముకుందన్, ప్రాచి తెహ్లన్, అచ్చుతన్, సిద్ధిక్, తరుణ్ అరోరా, మోహన్ శర్మ, అను సితార, కనిహ తదితరులు

దర్శకత్వం : ఎం. పద్మ కుమార్

నిర్మాత‌లు : వేణు కున్నపిల్లి

సంగీతం :  ఎమ్ జయచంద్రన్, బీజీఎమ్: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా

సినిమాటోగ్రఫర్ : మనోజ్ పిళ్ళై

ఎడిటర్:  రాజా మొహమ్మద్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన భారీ పీరియాడిక్ డ్రామా మమాంగం. పదిహేడవ శతాబ్దంలో మామాంగం అనే ఓ సాంప్రదాయ వేడుక చుట్టూ అల్లుకున్న వివాదాల ఆధారంగా ఈచిత్రాన్ని దర్శకుడు ఎమ్ పద్మ కుమార్ తెరకెక్కించారు. దాదాపు అన్ని ప్రధాన భాషలలో భారీగా పాన్ ఇండియా లెవెల్ లో మామాంగం మూవీ నేడు విడులైంది. మరి ఇన్ని అంచలనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎంత వరకు ఆ అంచనాలు అందుకుందో సమీక్షలో తెలుసుకుందా…

కథ:

శతాబ్దాలుగా జమోరిన్ రాజ వంశానికి చెందిన రాజులచే అణగదొక్కబడిన చావేరుకల్ జాతికి చెందిన వీరులు ప్రతి 12ఏళ్లకు భారతపూజ అనే నది ఒడ్డున జరిగే మామాంగం అనే వేడుక సాక్షిగా రాజుని చంపాలని ప్రయత్నం చేస్తూ వుంటారు. ఈ క్రమంలో ఆ జాతికి చెందిన వీరులందరూ వీరమరణం పొందుతారు. ఆ జాతిలో చివరిగా మిగిలిన ఓ బాలుడు ఈ సారి మామాంగం వేడుకలో రాజుని చంపడానికి బయలుదేరుతాడు. ఆ బాలుడికి మమ్ముట్టి సహాయంగా వస్తాడు. ఆ తెగవారికి రాజుకి ఉన్న వైరం ఏమిటీ? ఆ బాలుడి పగను మమ్ముట్టి ఎందుకు పంచుకున్నాడు? అసలు మమ్ముట్టి నేపధ్యం ఏమిటీ? మరి చివరికి వారు రాజుని చంపగలిగారా? అనేది తెరపైన చూడాలి.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథకు తగ్గట్టుగా భారీ సెట్స్ మరియు విజువల్స్ అలరిస్తాయి. పాన్ ఇండియా మూవీగా దాదాపు నాలుగు భాషలలో విడుదలైన మామాంగం చిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక ఈ మూవీలో చెప్పుకోదగ్గ మరో అంశం బీజీఎమ్. మూవీలోని చాలా సన్నివేశాలు తెరపై ఎలివేట్ ఐయ్యేలా బీజీఎమ్ సహకరించింది. ప్రేక్షకుడికి నేపధ్య సంగీతం నిజంగా మంచి అనుభూతిని పంచుతుంది.

మమ్ముట్టి పాత్ర పరిధి ప్రేక్షకులు ఉహించినంత లేకపోయినప్పటికీ ఆయన కనిపించిన సన్నివేశాలలో హీరోయిక్ ప్రజెన్స్, పోరాటాలు అభిమానులకు గూస్ బంప్స్ కలిగిస్తాయి. ఆ ఏజ్ లో మమ్ముట్టి యాక్షన్ సన్నివేశాల కొరకు పెట్టిన శ్రమను మెచ్చుకోవాల్సిందే.

మొదటి సగంతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మూవీ ప్రధాన కథలోకి ప్రవేశించడంతో పాటు వేగం పుంజుకొని కొంత ఆకట్టుకొనేలా సాగింది. ఆనాటి సంస్కృతి సంప్రదాయాలను తలపించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన విధానం నచ్చుతుంది.

ఈమూవీ ప్రధానంగా పోరాట సన్నివేశాలు, డాన్స్ లకంటే డైలాగ్స్ తో సాగుతుంది. మూవీ బిగినింగ్ మరియు అలాగే క్లైమాక్స్ లో వచ్చే రెండు భారీ పోరాట సన్నివేశాలు, వాటిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:

మామాంగం మూవీ పాన్ ఇండియా లెవెల్ లో అనేక భాషలలో విడుదలైనప్పటికీ మలయాళ వాసనలు మోతాదుకు మించి ఉన్నాయి. చాలా నెమ్మదిగా మొదలైన ఫస్ట్ హాఫ్ అసలు ఏమి జరుతుందో తెలియడానికే 20 నిమిషాల సమయం పడుతుంది. మొదటి సగం ఎమోషన్స్ తో నడిపించాలని దర్శకుడు భావించినా అవి వర్క్ అవుట్ కాలేదు. ఈమూవీ కథ కూడా చాలా క్లిష్టతతో కూడుకొని ఉండటం వలన ప్రేక్షకుడికి తేలికగా అర్థం కాదు.

స్టార్ హీరో మమ్ముట్టి ప్రజెన్స్ చాలా తక్కువ సన్నివేశాలకు పరిమితం చేయడం ఒకింత ఆయన అభిమానులకు నిరాశ కలిగించవచ్చు. ఆయన ఈమూవీలో గెస్ట్ రోల్ చేసిన భావన కలిగింది. అసలు కథను చెప్పే క్రమంలో అనేకమైన అవసరం లేని సన్నివేశాలు మూవీని డైవర్ట్ చేశాయి. మరీ అంతగా ఆసక్తి కలిగించని మలుపు మరియు వాటిని తెరకెక్కించిన విధానం ఏమంత ఆకట్టుకోవు.

పతాక సన్నివేశాలు బలహీనంగా, అనాసక్తిగా సాగాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నప్పటికీ ఇలాంటి భారీ పీరియాడిక్ డ్రామా తెరకెక్కించడానికి సరిపడా లేవు అనిపించింది.

సాంకేతిక విభాగం :

ఒక స్థాయి వరకు మెప్పించే నిర్మాణ విలువలు మామాంగం మూవీ కలిగి ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో మెప్పించలేదు. సినిమాటోగ్రాఫర్ మజోజ్ పిళ్ళై కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. గత కాలపు సంస్కృతి, సాంప్రదాయాలు ఆయన చక్కగా బంధించి తెరపై ఆవిష్కరించారు. తెలుగు డబ్బింగ్ వర్క్ అలాగే సాహిత్యం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ సినిమాకు మంచి ఆకర్షణ. సంచిత్ బల్హారి, అంకిత్ బల్హారి ల నేపధ్య సంగీతం అద్భుతం అని చెప్పాలి. చాలా సన్నివేశాలు ఎలివేట్ కావడానికి ఈ బీజీఎమ్ సహకరించింది.

ఇక దర్శకుడు పద్మ కుమార్ గురించి చెప్పాలంటే ఆయన మలయాళ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన మేకింగ్ పూర్తిగా మలయాళ ఫ్లేవర్ తో నిండిపోయింది. ఓ క్లిస్టమైన కథను చెప్పే క్రమంలో ఆయన తడబడ్డారు. అయన రాసుకున్న స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల నెమ్మదిగాసాగగా, మరికొన్ని చోట్ల కన్ఫ్యూషన్ తో నడిచింది.

తీర్పు:

భారీ పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన మామాంగం మూవీ ఆస్థాయి అంచనాలకు తగ్గట్టుగా లేదని చెప్పాలి. క్లిస్టమైన కథకు దర్శకుడు పద్మ కుమార్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి. స్లోగా సాగే నెరేషన్ మనసుకి హత్తుకోని ఎమోషన్స్ వలన మూవీ తేలిపోయింది. సూపర్ స్టార్ మమ్ముట్టి పాత్ర పూర్తి స్థాయిలో లేకపోవడం సినిమాకు బలహీనతగా మారింది. భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వెళ్లే ప్రేక్షకుడికి మామాంగం మూవీ సంతృప్తి పరచకపోవచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Version


Viewing all articles
Browse latest Browse all 2258

Trending Articles