విడుదల తేదీ : ఏప్రిల్ 18, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : అక్షయ్ కుమార్, ఆర్.మాధవన్, అనన్య పాండే, రెజీనా కసండ్రా తదితరులు
దర్శకుడు : కరణ్ సింగ్ త్యాగి
నిర్మాతలు :హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్ పాల్ సింగ్ బింద్రా, ఆనంద్తి వారీఫిల్మ్స్
సంగీతం : సాష్వత్ సచ్‌దేవ్
సినిమాటోగ్రఫీ : దేబోజిత్ రే
ఎడిటర్ : నితిన్ బేద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేసరి’కి రెండో భాగంగా ‘కేసరి చాప్టర్ 2’ రూపొందించారు దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ఆర్.మాధవన్, అనన్య పాండే ముఖ్య పాత్రల్లో నటించారు. నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ :
భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో చోటు చేసుకున్న జలియన్‌వాలా బాగ్ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. విషాదాన్ని మిగిల్చిని జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి ఒక వ్యక్తి మనస్తత్వమే కారణమా అనే కోణంలో ఈ సినిమాను రూపొందించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే అడ్వకేట్ శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి ముఖ్య కారణమైన జనరల్ డయ్యర్‌పై కేసు వేస్తాడు. ఆయనకు తోడుగా యువ అడ్వకేట్ దిల్‌రీత్ సింగ్(అనన్య పాండే) నిలుస్తుంది. బ్రిటిష్ తరఫు న్యాయవాది నెవిల్లే మెక్ కిన్లీ(ఆర్.మాధవన్) వాదిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి నిజాలను బయటపెట్టాలని శంకరన్ నాయర్ ప్రయత్నిస్తాడు..? ఈ ఉదంతానికి సంబంధించిన అసలు విషయాన్ని ఎలా రివీల్ చేశారు..? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
హిస్టారికల్ అంశాలను మెయిన్ ప్లాట్‌గా ఎంచుకున్నప్పుడు కథలో ఎలాంటి తప్పటడుగులు వేయకుండా ఉండాలి. ఈ పాయింట్‌ను దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశాడు. చరిత్రలో ఓ విషాదంగా నిలిచిన ఘటనను ఇలాంటి పాయింట్ ద్వారా కూడా చూపించవచ్చు అనే పాయింట్ అద్భుతంగా రక్తికట్టించారు.
ఇక శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ తన నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడని చెప్పాలి. బ్రిటిష్ వారు చేసిన దారుణ కాండను కోర్టు రూమ్ డ్రామాగా మలిచిన తీరు అద్భుతంగా చూపించారు. చరిత్రలోని కొన్ని కథలోని ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాయా.. అనే విధంగా దర్శకుడు రాసుకున్న కథ ఆకట్టుకుంది.
అటు నటీనటుల పర్ఫార్మెన్స్ ఏమాత్రం బోర్ కొట్టించకుండా ఉండటం.. కథను రక్తి కట్టించేందుకు ఎంచుకున్న అంశాలు, వాటికి సంబంధించిన వాస్తవాలను రివీల్ చేసే విధానం ప్రేక్షకులను మెప్పిస్తాయి. చరిత్రకు సంబంధించిన ఓ విషాదకర ఘటనను ఇలా కోర్టు రూమ్ డ్రామాలో ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి చక్కటి ఎగ్జిక్యూషన్‌లోనూ కొన్ని తప్పులు దొర్లాయి. ముఖ్యంగా కథను ఆరంభించిన తీరు చాలా స్లోగా అనిపిస్తుంది. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు సమయం తీసుకున్నాడు.
మాధవన్ లాంటి వెర్సటైల్ యాక్టర్‌కు ఇంకాస్త ప్రాధాన్యత ఇస్తే బావుండేది అనిపిస్తుంది. ఆయన పాత్ర ఆకట్టుకున్నా, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సైలెంట్ చేశారనే భావన కలుగుతుంది. క్లైమాక్స్‌ను మరికొంత ఆసక్తికరంగా ముగించాల్సింది అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దాన్ని ఎంగేజింగ్ కథగా మలిచిన తీరు చక్కగా వర్కవుట్ అయ్యింది. కోర్టు రూమ్ డ్రామాకి హిస్టారికల్ కాన్సెప్ట్‌ను జోడించి, ఆయన కథను ముందుకు తీసుకెళ్లిన తీరు బాగుంది. ఇక ఈ సినిమాలోని సీన్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది బీజీఎం. సాష్వత్ సచ్‌దేవ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ కాస్త మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘కేసరి చాప్టర్ 2’ హిస్టారికల్ అంశాన్ని టచ్ చేస్తూనే కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన తీరు ఆకట్టుకుంటుంది. వాస్తవాలను ఇలా కూడా వ్యక్తపరచవచ్చు అనే దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. అక్షయ్ కుమార్, మాధవన్ తమ పర్ఫార్మెన్స్‌లతో కథను రక్తి కట్టించారు. కొన్ని సీన్స్ స్లోగా అనిపించినా.. కథలో బలం ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా బోర్ కొట్టదు. కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష : కేసరి చాప్టర్ 2 – మెప్పించే హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.