విడుదల తేదీ : మే 16, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : తేజ, తన్మయి, ఝాన్సీ, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు
దర్శకత్వం : రాజ్ ఆర్
నిర్మాతలు : స్పిరిట్ మీడియా, స్టూడియో 99
సంగీతం : మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ : సన్నీ కుర్రపాటి
ఎడిటర్ : అనిల్ ఆలయం
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మల్లేశం, 8 ఏఎం మెట్రో వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు రాజ్ ఆర్, ఇప్పుడు 23 (ఇరవై మూడు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
చిలకలూరిపేట 1993 నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథలో సాగర్ (తేజ) సుశీల(తన్మయి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గడపాలని కలలు కంటాడు. త్వరగా డబ్బులు సంపాదించేందుకు అతడు ఓ భయంకరమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. ఫలితంగా ఓ ఘోర ప్రమాదం చటు చేసుకుంటుంది. అతను నిప్పటించిన బస్సులో 23 మంది అమాయకులు చనిపోతారు. దీంతో జైలు పాలైన సాగర్, పశ్చాతాప పడతాడు. తనను జైలు నుంచి విడుదల చేయాలని సాగర్ కోరుకుంటాడు. మరి సాగర్ జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి..? చట్టం అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుంది..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు రాజ్ ఆర్ మరోసారి రియలిస్టిక్ కథను ఎంచుకుని ప్రేక్షకులకు ఓ చక్కటి సందేశాన్ని అందించాడు. వాస్తవంగా జరగిని ఘటనలు ఆయన కలిపిన విధానం సరికొత్తగా అనిపిస్తుంది. వేర్వేరు ఘటనల్లో న్యాయం ఎలా జరిగింది.. కులం, హోదా, పవర్ వంటి అంశాలతో న్యాయం ఎలా మారుతుంది.. అనేది చాలా డేరింగ్‌గా చూపెట్టారు.
హీరోయిన్ తన్మయి ఖుషికి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆమె నటనపరంగా పర్వాలేదనిపించింది. ఝాన్సీ పాత్ర చిన్నదే అయినా, చాలా ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది.
హీరో ఫ్రెండ్‌గా పవన్ రమేష్.. జైలర్ పాత్రలో ప్రణీత్ తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. మిగతావారు తమ పాత్రలమేర అలరించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ బాగున్నా దానిని ప్రెజంట్ చేసిన విధానం ఆకట్టుకోదు. ఈ చిత్ర స్క్రీన్ ప్లే విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. పలు ఎమోషనల్ సీన్స్ బలంగా పండాల్సి ఉన్నా, అవి ఆకట్టుకోవు. చాలా సీన్స్ కేవలం వచ్చి వెళ్లినట్లుగా అనిపిస్తాయి. దర్శకుడి ఆలోచన బాగున్నా, ఆచరణలో తప్పులు జరిగినట్లు కనిపిస్తుంది.
ఈ చిత్ర క్యాస్టింగ్ ఈ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్. హీరోగా నటించిన తేజ ఆర్ పాత్రకు కావాల్సిన ఎమోషన్ పండించలేకపోయాడు. కీలక సన్నివేశాల్లోనూ అతని పాత్ర చాలా డల్‌గా కనిపిస్తుంది. కొత్త హీరోను తీసుకోవాలనుకున్న దర్శకుడు ఇంకాస్త మెరుగైన పర్ఫార్మర్‌ని సెలెక్ట్ చేసి ఉండాల్సింది.
ఇక మరో మైనస్ పాయింట్ ఈ సినిమాలోని వివిధ టైమ్‌లైన్‌లు. కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా, సినిమాలో పాత్రలు అలాగే కనిపిస్తాయి. దీంతో ఈ సినిమా రియలిస్టిక్‌గా అనిపించదు.
ఈ సినిమా పేస్ కూడా చాలా స్లోగా సాగడం ప్రేక్షకులను విసిగెత్తిస్తుంది. చాలా సీన్స్‌ను ఎక్కువసేపు చూపెట్టినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని కథ సాగదీతగా అనిపిస్తుంది. దీంతో ఈ సినిమా లెంగ్తీగా ఉందనే భావన కలుగుతుంది.
చాలా పాత్రలు ఇంకా మెరుగ్గా చూపెట్టాల్సింది. కథను కేవలం ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రమే కొన్ని పాత్రలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీంతో కథలోని ఎమోషన్ మిస్ అయినట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు రాజ్ ఆర్ సమాజంలో న్యాయం అందరికీ సమానంగా దక్కదు అనే పాయింట్‌ను చాలా చక్కగా రాసుకున్నారు. కానీ, దాని ఎగ్జిక్యూషన్‌లో ఆయన తడబడ్డారు. ఇంకా పదునైన రైటింగ్, చక్కటి నటీనటులు ఉండి ఉంటే ఈ సినిమా ఓ సాలిడ్ చిత్రంగా నిలిచేది. సన్నీ కుర్రపాటి సినిమాటోగ్రఫీ కొంతవరకు ఓకే అనిపించినా, కొన్ని సీన్స్‌లో ఆకట్టుకోదు. మార్క్ కె రాబిన్ బీజీఎం పర్వాలేదనిపించినా, కొన్ని సీన్స్‌ను ఎలివేట్ చేయలేకపోయింది. అనిల్ ఆలయం ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. చాలా సీన్స్‌ను ఆయన ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి.
తీర్పు :
ఓవరాల్‌గా, 23 (ఇరవై మూడు) చిత్రం ఓ చక్కటి సందేశాన్ని కలిగి ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ చిత్ర స్లో పేస్, నటీనటుల పర్ఫార్మెన్స్, నెరేషన్ ప్రేక్షకులను అలరించేలకపోయాయి. దర్శకుడు రాజ్ ఆర్ ఓ చక్కటి పాయింట్‌ను ప్రెజంట్ చేసినా, దాని ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదని చెప్పాలి. క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా కొంతవరకు నచ్చినా, మిగతా ఆడియన్స్‌కు ఇది నచ్చకపోవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష : 23 (ఇరవై మూడు) – ఆలోచన బాగుంది.. ఆచరణ ఫెయిల్ అయింది! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.