Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2263

సమీక్ష : ఖైదీ నంబ‌ర్ 150 –అభిమానులకు చిరంజీవి ఇచ్చిన కానుక !

$
0
0
Khaidi No 150 review

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 11, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : వి.వి.వినాయ‌క్

నిర్మాత : రామ్‌చ‌ర‌ణ్‌

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌

నటీనటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్

తెలుగు సినీ ప్రేక్షకులు, మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఖైదీ నెం 150’. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా కావడం, ఆయనకిది 150వ సినిమా కావడం వంటి కారణాలతో ఖైదీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇన్ని అంచనాలు నడుమ నేడే థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఎలా ఉంది? అభిమానులను, ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది? చూద్దాం..

కథ :

తెలివిగా జైలు నుండి తప్పించుకున్న ‘ఖైదీ నెంబర్ 150’ కత్తి శీను (చిరంజీవి) ఎలాగైనా బ్యాంకాక్ వెళ్లిపోవాలని ట్రై చేస్తుండగా అనుకోకుండా ఒక ప్రమాదంలో అతను శంకర్ (చిరంజీవి) అనే వ్యక్తిని కాపాడాల్సి వచ్చి, అతడ్ని పోలీసులకి పట్టుబడేలా చేసి అతని స్థానంలోకి వెళ్ళిపోయి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు.

కానీ శంకర్ జీవితం మీద ఒక ఊరి రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తరువాత తెలుసుకున్న కత్తి శీను షాక్ కు గురవుతాడు. అలా శంకర్ జీవితం గురించి తెలుసుకున్న శీను ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నాడు ? ఏం చేశాడు ? అసలు శంకర్ గతమేమిటి ? శంకర్ ని నమ్ముకున్న రైతుల సమస్యలు ఏమయ్యాయి ? శీను వలన జైలుకు వెళ్లిన శంకర్ పరిస్థితేంటి ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే అది మెగాస్టార్ చిరంజీవే. 9 ఏళ్ల తరువాత స్క్రీన్ మీద ఆయన్ను ఫుల్ లెంగ్త్ హీరోగా చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి. చిరంజీవి కూడా బాగా వర్కవుట్స్ చేసి యంగ్ గా కనువిందు చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన అసామాన్యమైన నటన, డైలాగులు, ఫైట్స్ బాగున్నాయి. ముఖ్యంగా ప్రతి పాటలోనూ చిరంజీవి వేసిన సూపర్ స్టెప్పులు ప్రేక్షకుల ఉత్సాహాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళేలా ఉన్నాయి.

రీమేక్ కథే అయినప్పటికీ ఒరిజినల్ వర్షెన్‌ను చిరంజీవికి తగ్గట్టుగా మలచడంలోనే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒరిజినల్ చూసినవారికైనా, చూడనివారికైనా సినిమా ఒకే ఫీలింగ్ కల్పించేలా ఉండడం కూడా చిరు ప్రెజెన్స్ వల్లే సాధ్యమైంది. ముఖ్యంగా ఆయన తనదైన టైమింగ్‌తో చేసిన కామెడీ కట్టిపడేసేలా ఉంది. తన రోల్‌కు మరీ ఎక్కువ ప్రాధాన్యత లేకున్నా, ఉన్నంతలో కాజల్ ఎప్పట్లానే తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది.

ఫస్టాఫ్‌ అంతా చిరు ఎనర్జిటిక్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సరదాగా నడుస్తూనే మరోవైపు కథలో ముఖ్యమైన రైతుల సమస్యను ఎలివేట్ చేయడంతో అద్భుతంగా తయారైంది. ఇక పాటలన్నీ మంచి ఊపు తెచ్చేవే కాకుండా, వాటిని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడం, చిరు డ్యాన్సుల అదిరిపోయేలా ఉండటంతో అభిమానులకు కనులవిందు చేశాయి. ముఖ్యంగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో రామ్ చరణ్ చిరంజీవితో కలిసి వేసిన స్టెప్పులు అభిమానులకు స్పెషల్ గిఫ్టనే చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రధానంగా కనిపించేది బలం లేని ప్రతి నాయకుడి పాత్ర అనే చెప్పాలి. చిరంజీవి అంతటి స్టార్ హీరోకి ఇమేజ్ ని సినిమాలో మోయాలంటే అంతే బలమైన ప్రతి నాయకుడు అవసరం. ఆద్యంతం హీరోతో పోటీ పడుతూ హీరో పాత్ర బలంగా మారేలా చేయాలి. కానీ ఇందులో విలన్ పాత్ర అలా చేయలేదు. చిరంజీవి ముందు చాలా వరకు చిన్నబోయింది. దీంతో సినిమాని చాలా వరకు చిరంజీవి వైపు నుండే చూడాల్సి వచ్చింది. ఆ పాత్రలో నటించిన తరుణ్ అరోరా నటన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. పైగా ఆయన చెప్పిన డబ్బింగ్ చూస్తే ఏదో హిందీ సినిమా చూసినట్టు తోచింది.

ఇక ఫస్టాఫ్ రైతుల సమస్యను ఎలివేట్ చేసినంత బలంగా సెకండాఫ్లో అంతే బలంగా దానికి పరిష్కారం చూపడంలో దర్శక రచయితలు విఫలమయ్యారు. సెకండాఫ్‌లో డ్రామా కూడా కాస్త ఎక్కువైపోయి, ఫస్టాఫ్ ఇచ్చేంత ఎగ్జైట్‌మెంట్ ఇవ్వలేకపోయింది. దీంతో క్లైమాక్స్ చిరంజీవి 150వ సినిమాకు ఉండాల్సిన స్థాయిలో లేక ఆఖరున నిరుత్సాహనికి గురిచేసింది. ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో కూడా ఎమోషన్ కాస్త తగ్గింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా వీవీ వినాయక్ తనపై మోపిన అతిపెద్ద బాధ్యతను సమర్ధవంతంగానే పోషించాడని చెప్పాలి. మురుగదాస్ కథను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి, అభిమానులు ఏయే అంశాలు కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకుంటూ, కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా వినాయక్ చూపిన ప్రతిభ మెచ్చుకోదగ్గది. దర్శకుడిగా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించడంలో వినాయక్ విజయం సాధించాడు. ఇకపోతే సెకండాఫ్ విషయంలో, ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే, సినిమా రేంజ్ వేరేలా ఉండేది.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్. విజువల్స్ పరంగా చూసినప్పుడు ఆ పాటల స్థాయి మరింత పెరిగినట్లనిపించింది. కొరియోగ్రాఫర్లు లారెన్స్, జానీ మాస్టర్లు చిరంజీవి చేత వేయించిన స్టెప్పులు సినిమాకే మేజర్ హైలెట్ గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కీలక సన్నివేశాలన్నింటిలో దేవిశ్రీ పనితనం చూడొచ్చు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకో స్థాయిని తీసుకొచ్చింది. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు చాలా వరకు బలంగా తాకేలా, చిరు ఇమేజ్ కు తగ్గట్టు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రామ్ చరణ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

తీర్పు :

భారీ అంచనాల మధ్య విడుదలైన మెగాస్టార్ 150వ చిత్రం అభిమానులను చాలా బాగా మెప్పించింది. అద్భుతమైన ఫస్టాఫ్, అందులో బలంగా ఎలివేట్ చేయబడ్డ రైతు సమస్య, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే స్టెప్పులు, అసమాన్యమైన ఆయన నటన, టైమింగ్ తో కూడిన మంచి కామెడీ ఇందులో ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం సినిమాను ప్రభావితం చేయలేకపోయిన బలహీనమైన ప్రతినాయకుడి పాత్ర, సెకండాఫ్ లో కాస్త సాగదీసిన డ్రామా, రైతుల సమస్యకు బలమైన పరిష్కారం చూపకపకుండా అసంతృప్తిగా వదిలేయడం వంటివి ఇందులో మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే మంచి మెసేజ్ తో చిరంజీవి ఇచ్చిన ఈ రీ ఎంట్రీ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనేలానే ఉంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2263

Latest Images

Trending Articles



Latest Images