Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష : గౌతమిపుత్ర శాతకర్ణి –క్రిష్ –బాలకృష్ణల గొప్ప ప్రయత్నం !

$
0
0
Gautamiputra Satakarni review

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 12, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : అంజన పుత్ర క్రిష్

నిర్మాతలు : సీతారామ పుత్ర సాయి బాబా జాగర్లమూడి, కమల పుత్ర వై రాజీవ్ రెడ్డి

సంగీతం : భారతి పుత్ర చిరంతన్

నటీనటులు : బసవతారకమ్మ పుత్ర బాలకృష్ణ, నీరజ పుత్రిక శ్రియ శరన్, జయలక్మి పుత్రిక హేమ మాలిని

భరత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన శాతవాహన చక్రవర్తి, గొప్ప యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను, గొప్పతనాన్ని, వీరత్వాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి దర్శకుడు క్రిష్ బాలకృష్ణతో కలిసి చేసిన ప్రయత్నమే ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. మొదటి నుండి మంచి అంచనాలను కూడబెట్టుకున్న ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వైభవంగా వచ్చింది. మరి క్రిష్ ఈ చిత్రం ద్వారా శాతకర్ణి కథను ఎలా చెప్పాడో చూద్దాం…

కథ :

గౌతమి బాలాశ్రీ బిడ్డగా జన్మించిన శాతకర్ణి చిన్నతనం నుండే దేశంలో ఉన్న రాజుల మధ్య యుద్దాలు జరగకూడదు, అలా జరగకుండా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని రాజ్యాలను కలిపి ఒకే మహా సామ్రాజ్యంగా చేసి తానే సుభిక్షంగా పాలించాలని సంకల్పించుకుంటాడు.

ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి యుద్ధమే మార్గమని నమ్మి, కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి వరుసగా అన్ని రాజ్యాలను జయించి అఖండ భారతాన్ని నిర్మిస్తాడు. ఆ క్రమంలో అతనికి, అతని భార్యకి మధ్య దూరం ఏర్పడుతుంది. అదే సమయానికి ఒక విదేశీ శత్రువు వలన తాను నిర్మించిన అఖండ భారతానికి ముప్పు వాటిల్లుతుందని భావించి భవిషత్తు కోసం రాజ్యానికి బలమైన పునాదులు వేయాలని చరిత్రలో చివరి యుద్దానికి సిద్దమవుతాడు.

అలాంటి శాతకర్ణికి జైత్రయాత్ర సమయంలో తన భార్యతో ఎలాంటి విబేధాలు ఏర్పడ్డాయి ? అతని తల్లి అతన్ని ఎలా వెన్నుతట్టి ముందుకు నడిపింది ? శాతకర్ణి జైత్రయాత్ర ఎలా సాగింది ? శాతకర్ణి అఖండ భారతాన్ని ఎలా నిర్మించాడు ? విదేశీ శత్రువుల బారి నుండి దాన్ని ఎలా కాపాడాడు ? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు క్రిష్ ఎంచుకున్న నైపథ్యం గురించి. తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ప్రేక్షకుడికి మొదట్లోనే ఎమోషనల్ గా బాగా కనెక్టవుతుంది. ఇక యువరత్న బాలకృష్ణ ఆ పాత్రను పోషించడంతో అది ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. మొదటి నుండి పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసే బాలయ్య శాతకర్ణి పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించడంలో నూటికి నూరు పాళ్ళు విజయం సాధించి ఆకట్టుకున్నాడు.

శాతకర్ణి పాత్రకు సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిని బాలయ్య పలికించిన తీరు సినిమా మొత్తానికి మేజర్ హైలెట్ ముఖ్యంగా ఆయన అభిమానులకైతే వీనుల విందనే చెప్పొచ్చు. ఇక దర్శకుడు క్రిష్ శాతకర్ణి జీవితం నుండి తీసుకున్న ప్రధాన అంశాలు అతనికి, అతని తల్లికి మధ్య ఉన్న అనుబంధం, శాతకర్ణి పట్ల అతని భార్య దృక్పథం, అఖండ భారతాన్ని శాతకర్ణి సాదించాలనుకోవడంలో అతని అంతరంగం, అనుసరించిన కఠిన మార్గాలు, కొడుకును పణంగా పెట్టి అతను పడిన కష్టాలు, ప్రదర్శించిన సాహసం వంటివి చూపడం నచ్చింది.

ఇక కథలో బాలకృష్ణ భార్య వాసిష్టీ దేవిగా నటించిన శ్రియ నటన బాగుంది. బాలకృష్ణకు, ఆమెకు మధ్య ఫస్టాఫ్, సెకండాఫ్లో నడిచిన కొన్ని ఏమోషనల్ సన్నివేశాలు బలంగా తాకాయి. అలాగే గౌతమి బాలాశ్రీ పాత్రలో హేమామాలిని నటన సినిమాకి మరో పెద్ద అసెట్.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే చారిత్రిక నైపథ్యంతో తెరకెక్కిన సినిమా కాబట్టి అందులో బలమైన, ఉత్కంఠ భరితమైన కథనం ఉంటుందనే ఉత్సాహం సినిమా మొదలవడానికి ముందు, మొదలైన కాసేపటి వరకు ఉంది కానీ ఆ తరువాత ఎగిరిపోయింది. ఇలాంటి చారిత్రిక అంశాలతో తెరకెక్కిన సినిమా ద్వారా వినోదం పంచలేరు కాబట్టి ఉత్కంఠనైనా కలిగించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో ఆ ఫీలింగ్ చాలా వరకూ కనిపించలేదు. రాజులు, రాజ్యాలు, వీరుల కథలు చెప్పేటప్పుడు ప్రేక్షకుడు కోరుకునేది, వాస్తవంగా అతనికి అత్యంత ఉత్కంఠను కలిగించే అంశాల్లో ప్రధానమైనది యుద్దాలే. అలాంటి యుద్ధాలే తేలిపోవడంతో ఫస్టాఫ్, సెకండాఫ్ లు పూర్తి స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయి. అలా కాకుండా వార్ సీక్వెన్సులు ఎమోషనల్ గా కనెక్టయుంటే సినిమా ఫలితం ఇంకా గొప్పగా ఉండేదనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇక సినిమా క్లైమాక్స్ లో ఒక్క బాలకృష్ణ మినహా చెప్పుకోదగ్గ విశేషమేమీ కనబడలేదు. యుద్ధ సన్నివేశాల్ని ఇంకాస్త వివరంగా తెరకెక్కించి ఉండాల్సింది. అలాగే క్రిష్ నుండి ఆశించే నాటకీయ కథనం ఇందులో చాలా వరకూ కనిపించలేదు. దాంతో సినిమాపై క్రిష్ మార్క్ బలంగా కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడుకుంటే శాతకర్ణి జీవితం నుండి అతి ముఖ్యమైన అంశాలను తీసుకుని సినిమాగా చేసిన ఆయన ప్రయత్నం మెచ్చుకోదగ్గది పైగా చాలా వరకు సక్సెస్ అయింది కానీ అందులో తన ట్రేడ్ మార్క్ డ్రామా, ఎమోషన్ కంటెంట్, ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో మిస్సయ్యాయి. రచయిత సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు అద్భుతంగా ఉంది సినిమాకి కొత్త హుందాతనాన్ని తెచ్చాయి. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు చారిత్రకమైన పరమైన లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఇక చిరంతన్ భట్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా యుద్ధ సన్నివేశాల్లో తీవ్రతను మాత్రం అది పెంచలేకపోయింది. రచయిత సీతారామ శాస్త్రి పాటలకిచ్చిన సాహిత్యం ఉన్నతంగా ఉంది. బిబో శ్రీనివాస్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

తీర్పు :

భరత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన శాతవాహన చక్రవర్తి, యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని జాతికి తెలియజెప్పడానికి దర్శకుడు క్రిష్, బాలకృష్ణలు కలిసి చేసిన ఈ గొప్ప ప్రయత్నం బాగుంది. ఆకట్టుకునే కథాంశం, బాలకృష్ణ గొప్ప నటన, సాయి మాధవ్ బుర్రా డైలాగులు, శ్రియ – బాలకృష్ణ, హేమామాలిని – బాలకృష్ణల మధ్య నడిచే ఎమోషన్ సన్నివేశాలు ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా క్రిష్ మార్క్ డ్రామా మిస్సవడం, కథనంలో కానీ, ముఖ్యమైన యుద్ధ సన్నివేశాల్లో కానీ ఉత్కంఠ కనిపించకపోవడం నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ చిత్రం జాతి చరిత్రను, గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్లకు, క్రిష్ సినిమాల్ని, బాలకృష్ణ నటనను ఇష్టపడే వాళ్లకు తప్పక నచ్చుతుంది.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles