లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నెక్స్ట్ ఛాయిస్ గా హిందీ ఫిల్మ్ చింటూ కా బర్త్ డే ని తీసుకోవడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం
కథాంశం ఏమిటీ?
ఈ సినిమా 2004లో ఇరాక్ నేపథ్యంలో నడుస్తుంది. ఇండియాకు చెందిన ఓ కుటుంబం మంచి జీవితం కోసం ఇరాక్ వెళతారు. ఆ ఫ్యామిలీలో చిన్నవాడైన చింటూ (వేదాన్త్ చిబ్బర్) పుట్టిన రోజు ఈ సారి ఘనంగా జరపాలని చింటూ కుటుంబ సభ్యులు అనుకుంటారు. చింటూ తన స్కూల్ ఫ్రెండ్స్ ని సాయంత్రం పార్టీకి ఆహ్వానిస్తాడు. సంతోషకరమైన ఆ రోజు ఊహించని పరిణామంతో ఆ కుటుంబం ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. సంతోషంగా చింటూ బర్త్ డే జరపాలనుకున్న ఆ కుటుంబానికి ఎదురైన సమస్య ఏమిటీ? దానిని నుండి వారు ఎలా బయటపడ్డారు? ఇంతకీ చింటూ బర్త్ డే జరిగిందా? అనేదే మిగతా కధాంశం..
ఏమి బాగుంది?
చింటూ తండ్రి పాత్ర చేసిన సీనియర్ నటుడు వినయ్ పథక్ అవుట్ స్టాండింగ్ నటన కనబరిచాడు. కొడుకు సంతోషం కోసం తపించే తండ్రిగా, సమస్యలను తన దరికి చేరకుండా హ్యాపీగా ఉంచడానికి ఆయన చేసే ప్రయత్నాలు, నటన సినిమా చివరి వరకు ఆకట్టుకున్నాయి. సద్దాం హుస్సేన్ పతనాన్ని ఓ ఆరేళ్ళ చిన్నారి వివరించే సన్నివేశం సినిమాకే హైలెట్ అని చెప్పాలి.
అక్రమ వలస దారుల కష్టాలు, ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికన్ సోల్జర్స్ అనుభవించిన ఇబ్బందులు చక్కగా చూపించారు. ఎమోషన్స్ బాగా పండాయి. బీజీఎమ్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.
ఏమి బాగోలేదు?
ఎటువంటి ట్విస్ట్స్ అండ్ టర్న్ లేని ఓ సాధారణ స్టోరీ ఇది. 77 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం కొంచెం నెమ్మదిగా సాగుతుంది.
చివరి మాటగా
చక్కని ఎమోషనల్ సన్నివేశాలతో సాగే చింటూ కా బర్త్ డే ఆద్యంతం అలరిస్తుంది. వార్ సిట్యుయేషన్ లో పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ పడే తాపత్రయం కట్టిపడేస్తుంది. మొత్తంగా ఈ లాక్ డౌన్ టైం లో ఫ్యామిలీ మొత్తం కలిసి చూదగ్గ మూవీ ఇది.
ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘క్లైమాక్స్’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘శ్రేయాస్ ఈటి అప్’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథా నేపథ్యం:
ఓ జంట (మియా మాల్కోవా, ఆమె ప్రియుడు) సరదాగా విహార యాత్ర కోసమని ఓ భయానిక ఎడారిలోకి వస్తారు. ఆ ఎడారిలో ఆ జంటకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే వాళ్లను కొంతమంది వింత వక్తులు భయపెడుతూ ఉంటారు. వారి నుండి తప్పించుకుని తమకు ఎదురైన సంఘటనలను ఆ ప్రాంతాలోని పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పటానికి ప్రయత్నం చేస్తోంది ఆ జంట. కానీ అక్కడ వాళ్లు ఇంకా ఆపదలో చిక్కుకుంటారు. ఇంతకీ ఆ ఆపద ఏమిటి ? దాని నుంచి ఆ జంట ఎలా తప్పించుకుంది? ఈ మధ్యలో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు వాళ్ళు ఏమైపోయారు ? అనేది మిగతా కథ.
ఏం బాగుంది:
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి ఎక్కువగా ముచ్చటించుకునే ఆకాశం మనకు ఇవ్వలేదు రామ్ గోపాల్ వర్మ. అయితే యూత్ ని ఆకట్టుకోవడానికి ఆర్జీవీ వాడుకున్న చీప్ ట్రిక్స్ మియా మాల్కోవా నగ్న దృశ్యాలు, ఘాటు ముద్దులు, ఆమె తొడల ఎక్స్‌పోజింగులు కొంతమేరకు ఆ వర్గం ప్రేక్షకులకు పర్వాలేదనిపించొచ్చు. కానీ వాటి కోసం మిగతా టార్చర్ అంతా భరించే ఓపిక బహుశా ఎవరికీ ఉండకపోవచ్చు. ఇక మియా మాల్కోవా నటించడానికి గట్టి ప్రయత్నం అయితే చేసింది. ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏమిలేదు. ఒక్క అగస్త్య మంజు ఫొటోగ్రఫీ బాగుంది.
ఏం బాగాలేదు:
ఈ సినిమాలో ఏం బాగాలేదు అనేకంటే.. అసలు సినిమానే బాగాలేదు అనడం కరెక్ట్ ఏమో. 52 నిమిషాల నిడివి గల ఈ క్లైమాక్స్ సినిమాలో అరిగిపోయిన సౌండ్ ఎఫెక్ట్స్, విషయం లేని టెన్షన్ బిల్డప్ షాట్స్, మియా అనవసరపు పరుగులు, స్పోర్ట్స్ బైకుల పై ఎందుకు వచ్చి వెళ్తున్నారో తెలియని వ్యక్తులు, మధ్యమధ్యలో దెయ్యాల ప్రభావం.. ఇలా మొత్తంగా ఈ ‘క్లైమాక్స్’ ఒక చెత్త సినిమా.
దీనికి తోడు పూర్తి ఎడారి నేపథ్యంలో సాగే ఈ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ,మినిమమ్ ఇంట్రస్ట్ కూడా లేకపోవడం కొసమెరుపు. అసలు సినిమాలో ఎలాంటి మలుపులు లేకుండా ఒకే విషయాన్ని పదేపదే చెబుతూ చాల సన్నివేశాలను అనవసరమైన ల్యాగ్ తో సాగతీయడం, అలాగే వర్కౌట్ కానీ ప్లే అండ్ హారర్ సీన్స్ తో ఆడియన్స్ బాగా బోర్ గా ఫీల్ అవుతారు.
అసలు.. ఈ సినిమా తీయాలనే ఆలోచన రామ్ గోపాల్ వర్మకు ఎందుకొచ్చిందో.. అయినా ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా ట్రీట్మెంట్ తో ఆ కాన్సెప్ట్ ను ఎలివేట్ చేసి ఇంట్రస్టింగ్ ప్లేతో కన్విన్స్ గా చెప్పాలి. కానీ ఆర్జీవీ స్క్రిప్ట్ పై కనీస స్థాయిలో కూడా వర్క్ చేయలేదు.
చివరి మాటగా:
వివాదాస్పద అంశాలతో దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ తీసిన ఈ ‘క్లైమాక్స్’ సినిమాలో విషయం లేదు. మియా మాల్కోవాతో చూపించాల్సిందంతా వర్మ ట్రైలర్ లోనే చూపించేసాడు, అంతకు మించి సినిమాలో ఇంకేమి లేదు. సినిమా ఏ మాత్రం ఆసక్తికరంగా సాగదు. కథా కథనాలు, సినిమాలో సరైన ప్లో లాంటి అంశాలు ఈ సినిమా నుండి అస్సలు ఆశించలేం. అదే రొటీన్ తంతు వ్యవహారంతో వర్మ అడియన్స్ బాగానే విసిగించాడు. పూర్తి స్థాయిలో నిరాశ పరిచే ఈ సినిమాని చూడకపోవడమే బెటర్, కనీసం మనకు టైం అండ్ మనీ అన్నా సేవ్ అవుతాయి.
ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సిరిస్ ‘మెంటల్‌హుడ్’. కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ‘ఆల్ట్‌బాలాజీ’లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరిస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథా నేపథ్యం :
మీరా శర్మ (కరిష్మా కపూర్) ఒక మాజీ మిస్ కాన్పూర్. అలాగే ప్రస్తుతం ముగ్గురు పిల్లలకు తల్లి కూడా. ఆమె భర్త (సంజయ్ సూరి)తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముంబైలో అడుగుపెడుతుంది. మీరా తన ముగ్గురు పిల్లల గురించి మరియు ఎల్లప్పుడూ బిజీగా ఉండే తన భర్తతో తన జీవితం గురించి వివరించడానికి ఒక బ్లాగును కూడా ప్రారంభిస్తుంది. ఇవే కాకుండా, సంధ్య మృదుల్, శిక్పాల్ శుక్లా, అమృత పూరి వంటి మిగిలిన తల్లులతో కూడా కరిష్మా తన అభిప్రాయాలను పంచుకుంటుంది. మొత్తంమీద ఈ వెబ్ సిరీస్ తమ స్వంత సమస్యలతో ఉన్న సూపర్ మామ్స్ వారి జీవితాల్లోని కీలకమైన దశల ఎలా సాగాయి అనేది మిగతా కథ.
ఏం బాగుంది :
నటీనటుల ప్రదర్శన పరంగా చూసుకుంటే ప్రధానంగా తల్లి పాత్రలో కరిష్మా కపూర్ అద్భుతంగా నటించింది. ఇక తల్లుల పై ఆధారపడి ఉన్న సంఘటనల గురించి, అలాగే తమ సమస్యలు ఉన్నా తల్లలు తమ పిల్లలను మరియు కుటుంబాన్ని ఎలా చూసుకుంటారనే అంశాలు బాగున్నాయి. ఇక నేటి ఆధునిక మహిళల జీవితంలోని వివిధ కోణాలతో పాటు వారి పిల్లలను పెంచే క్రమంలో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి.
శిల్పా శుక్లా, సంధ్య మృదుల్ వంటి ఇతర నటులు కూడా తమ తమ పాత్రలలో బాగా నటించారు. ఇక ఎపిసోడ్ల ప్రారంభ భాగాలలోని అన్ని సమస్యలు బాగా రాశారు. సింగిల్ గా డినో మోరియా కూడా తన పనిని సంపూర్ణంగా చేసారు. మొత్తం మీద ఈ వెబ్ సిరీస్ థీమ్ ముఖ్యంగా మహిళలందరికీ చాలా సాపేక్షంగా ఉంటుంది.
ఏం బాగాలేదు :
ఈ సిరీస్ చిన్న సమస్యలను కూడా అతి బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది ప్లే. మధ్యతరగతి తల్లులకు రోజువారీ పనులేమిటి అనే అంశాలు బోర్ గా సాగుతాయి. పైగా చాల సన్నివేశాలు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తాయి. ఎడిటింగ్ కూడా అస్సలు బాగా లేదు. బిజిఎమ్ మరియు కెమెరావర్క్ కూడా జస్ట్ ఒకే అనిపిస్తాయి. ఇక టీనేజ్ పిల్లలతో తల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు సరిగ్గా పరిష్కరించబడేలా సీన్స్ రాసుకోలేదు.
చివరి మాటగా :
మొత్తంమీద, మెంటల్‌హుడ్ అనేది లేడీ-ఓరియెంటెడ్ వెబ్ సిరీస్, ఇది జీవితంలో తల్లి మరియు పిల్లలకు సంబంధించి వచ్చే సంఘటనలకు ఆధారంగా సాగుతుంది. నటీనటుల ప్రదర్శనలు చాలా బాగున్నాయి. ప్రారంభ నాలుగు ఎపిసోడ్‌లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ బాగాలేని సాంకేతిక అంశాలు, అసమాన మరియు ఆకస్మిక ముగింపు ఆడియన్స్ ఫీల్ ను పాడు చేస్తాయి. దాంతో ఈ సిరీస్, బాగుంది అని చెప్పలేము, అలా అని పూర్తిగా బాగాలేదు అని చెప్పలేము. కాబట్టి ఈ లాక్ డౌన్ సమయంలో మీకు ఇంకేమీ పనిలేకపోతేనే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.
మన లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నేడు యూట్యూబ్ లో విడుదలైన హిందీ షార్ట్ ఫిల్మ్ నట్కట్ ని తీసుకోవడం జరిగింది. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..
కథాంశం ఏమిటీ?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న విలేజ్ అది. సాంప్రదాయ బద్దమైన ఓ గృహిణి(విద్యా బాలన్) తన ఇంటికి వచ్చిన బంధువులకు ఆహారం వడ్డిస్తూ ఉంటుంది. వచ్చిన బంధువులు భోజనం చేస్తూ, వాళ్ళను ఇబ్బంది పెడుతున్న ఓ మహిళ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు భోజనం చేస్తున్న సోను కూడా ఆ మహిళను గురించి తప్పుగా మాట్లాడతాడు. చిన్న పిల్లవాడైన సోను ఓ మహిళ గురించి అలా మాట్లాడడం ఆ గృహిణికి బాధ కలిగిస్తుంది. మహిళను ఎలా గౌరవించాలో ఓ రాజు కథ ద్వారా సోనుకు ఆ ఆమె వివరిస్తుంది.
ఏమి బాగుంది?
ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ అద్భుతం. ఆడవారిని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని చెప్పిన తీరు చాలా బాగుంది. చుట్టూ ఉండే పరిసరాలు పిల్లల లో చెడు ప్రవర్తన ఏర్పడడానికి ఎలా కారణం అవుతున్నాయనేది చక్కగా వివరించారు.
ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో తల్లి పాత్ర చేసిన విద్యా బాలన్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలు చాల బాలన్స్డ్ గా చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆమె నిర్మాత కూడా కావడం విశేషం. ఇక చిన్న పిల్లవాడు సోను పాత్ర చేసిన సంచిత పటేల్ అద్భుతంగా చేసింది.
ఏమి బాగోలేదు?
ఈ షార్ట్ ఫిల్మ్ లో కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. స్కూల్ పిల్లల క్రైమ్ నేచర్ లాంటివి. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ బాగా మోరలిస్టిక్ గా ఉంది.
చివరి మాటగా
మొత్తంగా చెప్పాలంటే నట్కట్ ఓ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్. పిల్లల వ్యక్తిత్వాన్ని తల్లితండ్రులు ఎలా తీర్చిదిద్దాలి అనే విషయాన్ని చక్కగా చెప్పారు. విద్యాబాలన్ మరియు సంచిత పటేల్ నటన మరో ఆకర్షణ.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నెక్స్ట్ ఎంపికగా హిందీ వెబ్ సిరీస్ కోడ్ ఎమ్ ఎంచుకోవడం జరిగింది.క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటీ?
ఓ టెర్రర్ ఆపరేషన్ ఓ ఆర్మీ అధికారితో పాటు మరో ఇద్దరు చంపబడతారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు తీసుకున్న లేడీ ఆర్మీ లాయర్ మోనికా మెహ్రా(జెన్నిఫర్ వింగెట్) కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు తెలుసుకుంటుంది. ఇండియన్ ఆర్మీ పై జరుగుతున్న ఓ కుట్ర సంబంధించిన ఆపరేషన్ ఆమె బట్టబయలు చేస్తుంది. ఆమె ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన అంశాలు ఏమిటీ? ఆమె ఆ సవాళ్లను ఎదిరించి ఎలా ఉపద్రవాన్ని అడ్డుకుంది అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
ఒక కోడ్ ఆధారంగా ఆర్మీ నేపథ్యంలో అల్లుకున్న క్రైమ్ డ్రామా ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్లో మధ్యలో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగాయి. 20 నిమిషాల నిడివి కలిగిన ప్రతి ఎపిసోడ్ కి ఇచ్చిన ముగింపు డీసెంట్ గా ఉంది . ఇక బీజీఎమ్ సన్నివేశాలకు తగిన విధంగా మంచిగా సాగింది. ఆర్మీ అధికారులు దేశం కోసం తమ జీవితాలు ఎలా త్యాగం చేస్తారో ఎమోషనల్ గా చెప్పిన తీరు బాగుంది. ఇక నటీనటులలో రాజత్ కపూర్ నటన మెప్పిస్తుంది.
ఏమి బాగోలేదు?
కోడ్ ఎమ్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర చేసిన జెన్నిఫర్ వింగెట్ చాలా వరకు ఓ సీరియస్ ఆర్మీ లాయర్ రోల్ లో మెప్పించడానికి ప్రయత్నించినా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆమె అనేక సన్నివేశాలలో తేలిపోయింది. ఇక ప్రారంభం ఎపిసోడ్స్ నిరాసక్తిగా ఉండడంతో, ఆరంభమే బాగోలేదు అన్న భావన కలుగుతుంది.
పట్టులేని కథనం ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగించలేకపోయింది. నెమ్మదిగా సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రేక్షకుడిని సిరీస్ లో ఇన్వాల్వ్ చేయలేకపోయింది. ఆర్మీ నేపధ్యానికి సంబంధించిన అనేక సన్నివేశాలలో అసలు లాజిక్ ఫాలో కాలేదు.
చివరి మాటగా
అక్కడక్కగా మెప్పించే కొన్ని ట్విస్ట్స్ మినహా కోడ్ ఎమ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించలేక పోయింది. ట్రైలర్ చూసి గొప్ప అంచనాలతో సిరీస్ చూడడం మొదలుపెట్టిన వారికి ఆశాభంగం తప్పదు. మొత్తంగా లాక్ డౌన్ లో కోడ్ ఎమ్ బెస్ట్ ఛాయిస్ కాదని చెప్పాలి.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నేడు హిందీ వెబ్ సిరీస్ రక్తాన్చల్ ని తీసుకోవడం జరిగింది. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉన్న ఈ క్రైమ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షంలో చూద్దాం..
కథాంశం ఏమిటీ?
1980లలో ఉత్తర్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతంలో వసీం ఖాన్(నిఖితన్ ధీర్) గ్యాంగ్ స్టర్ గా ఆ ప్రాంతంపై ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాడు. అక్కడి ప్రభుత్వ అధికారులను బెదిరించి అన్ని కాంట్రాక్ట్స్ తన హస్తం గతం చేసుకొని సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో ఆ ప్రాంతానికి విజయ్ సింగ్(క్రాంతి ప్రకాష్ ఝా) వచ్చి వసీం ఖాన్ అధిపత్యానికి గండికొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన పోరులో వీరిద్దరిలో ఎవరు గెలిచారు అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
ప్రధాన పాత్రలో ఒకటైన వసీం ఖాన్ పాత్ర చేసిన నిఖితన్ ధీర్ సాలిడ్ పెరఫార్మెన్సు తో ఆకట్టుకున్నారు. హల్క్ బాడీలో నెగెటివ్ రోల్ కి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా సరిపోయింది. డైలాగ్ డెలివరీ మరియు నటన పరంగా కూడా నిఖితన్ ధీర్ ఆకట్టుకున్నారు.
మరో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిన క్రాంతి ప్రకాష్ ఝా నటన ప్రేక్షకులకు ఆసక్తికలిగించే మరో అంశం.
ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య అధికారం, ఆధిపత్యం కోసం జరిగే పోరును చక్కగా తెరకెక్కించారు. ఇక 80ల లో ఉత్తర భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో లోకల్ డాన్స్ ఆధిపత్యం ప్రజలపై, అధికారులుపై ఎలా ఉండేదో చూపించిన విధానం బాగుంది.
ఏమి బాగోలేదు?
రక్తాన్చల్ వెబ్ సిరీస్ ప్రధాన బలహీనత క్లైమాక్స్. ఇద్దరు బలమైన ప్రత్యర్థుల మధ్య అంత పెద్ద పోరు నడిచాకా ముగింపు పై మరిన్ని అంచనాలు ఏర్పడగా, ఆ అంచనాలను అందుకోలేకపోయారు. ఇక ప్రారంభం ఘనంగా ఉన్నా, మిడిల్ ఎపిసోడ్స్ కొంచెం డల్ గా సాగాయి. మితిమీరిన హింస కూడా ఓ బలహీనతగా చెప్పుకోవచ్చు.
చివరి మాటగా
ప్రధాన పాత్రలు పోషించిన నటుల నటన, బలమైన కథలో ఆకట్టుకొనే పాత్రలు, అద్భుతమైన ఆరంభం కలిగిన రక్తాన్చల్ వెబ్ సిరీస్ చాల వరకు ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇస్తుంది. మిడిల్ ఎపిసోడ్స్ తో పాటు, మంచి క్లైమాక్స్ ఉండి ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉండేది. లాక్ డౌన్ సమయంలో ఓ లుక్ వేయవచ్చు.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు అమితాబచ్చన్ మరియు యంగ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో ని ఎంచుకోవడం జరిగింది. నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటీ?
లక్నో నగరంలోని ఓ పురాతన భవంతికి యజమాని అయిన మీర్జా (అమితాబచ్చన్) ఆ భవంతిలో ఏళ్లుగా అద్దెకు ఉంటున్న వారిని బయటికి పంపివేసి అందులో ఒక్కడే సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. ఐతే ఆ భవంతిలో ఉంటున్న బంకీ(ఆయుష్మాన్ ఖురానా) అక్కడి నుండి వెళ్లడానికి ఇష్టపడడు. దీనితో మీర్జాకు అతను పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. చేసేదేమి లేక మీర్జా లీగల్ గా వారి చేత భవంతి ఖాళీ చేయించాలని ప్రయత్నం మొదలుపెడతాడు. మరి మీర్జా ప్రయత్నం ఎంత వరకు విజయం సాధించింది? మీర్జా, బంకీ ల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
దర్శకుడు సూజిత్ సిర్కార్ ఓ అద్భుతమైన కథకు అలరించే పాత్రలు జోడించి ప్రేక్షకులను మాయ చేశారు. పురాతన నగరం లక్నో నేపథ్యంలో ఆయన నడిపించిన కథనం ఆకట్టుకుంటుంది.
మీర్జా పాత్రలో అమితాబ్ నటన సినిమాను పతాక స్థాయికి తీసుకెళుతుంది. వయసు మళ్ళిన పాత్రలో ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ మెస్మరైజ్ చేస్తాయి. ముఖ్యంగా ఆయన నడక తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
వైవిధ్యమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో మారు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. అమితాబ్ లాంటి లెజెండరీ యాక్టర్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్న ఆయన పోటీపడి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ హైలెట్ అని చెప్పాలి.
మీర్జా, బంకీ మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాలో హ్యూమర్ జోడించిన తీరు బాగుంది. బలమైన కథలోని పాత్రలు చాలా సహజంగా వాస్తవానికి దగ్గరగా సాగాయి. డైలాగ్స్ మరియు సినిమా నేపథ్యంతో పాటు, ట్విస్ట్స్ మరియు క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతాయి.
ఏమి బాగోలేదు?
మంచి ఆరంభం దక్కించుకున్న ఈ చిత్రం మధ్యలో నెమ్మదిస్తుంది. ఈ సమయంలో ఆయుష్మాన్ ఖురానా పాత్రకు పరిధి లేకుండా పోయింది. కొంచెం ఎక్కువ హాస్యం, కమర్షియల్ అంశాలు ఆశించి వారికి ఆశాభంగం అయ్యే అవకాశం ఉంది.
చివరి మాటగా
ఆకట్టుకునే కథా, కథనం, మైమరపించే పాత్రలతో సాగే గులాబో సితాబో ఓ చక్కని చిత్రంగా చెప్పుకోవచ్చు. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటన తెరపై ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మధ్యలో కొంచెం నెమ్మదించిన కథనం మినహాయిస్తే ఈ మూవీ తప్పక చూడాల్సినది. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగిన చిత్రం.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు ఇన్వెస్టిగేటివ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ స్పెషల్ ఓప్స్ వెబ్ సిరీస్ ని ఎంచుకోవడం జరిగింది. డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటీ?
2001లో ఐదుగురు తీవ్రవాదులు ఇండియన్ పార్లమెంట్ భవనంపై దాడి చేస్తారు. ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు టెర్రరిస్టులు చంపబడతారు. ఐతే ఆ దాడిలో పాల్గొంది ఐదుగురు కాదు, ఆరుగురు అని భావించిన ‘రా’ ఆఫీసర్ హిమ్మత్ సింగ్(కె కె మీనన్) ఆ దాడి వెనకున్న ఆరవ టెర్రరిస్ట్ కోసం తన నలుగురు సభ్యుల టీంతో ప్రపంచ దేశాలలో వెతుకులాట మొదలుపెడతాడు. మరి ఆ టెర్రరిస్ట్ వారికి దొరికాడా లేదా అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
మంచి నటుడిగా పేరున్న కె కె మీనన్ రా ఆఫీసర్ గా తన ఎక్స్ట్రార్డినరీ పెరఫార్మెన్సు తో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తన టీమ్ ని గైడ్ చేసే ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా ఆయన పాత్ర ఆకట్టుకుంది. టెర్రర్ అటాక్స్ ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మొదటి ఎపిసోడ్స్ లో చక్కగా చూపించారు. అలాగే చివరి ఎపిసోడ్స్ వేగంగా సాగే కథనం, అలరించే ట్విస్ట్స్ తో ఆకట్టుకున్నాయి.
సీక్రెట్ ఏజెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వారు ఇబ్బందులు, ఎదుర్కొనే ప్రమాదాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. వివిధ దేశాల్లో సాగే వెతుకులాట సన్నివేశాలు అలాగే నిర్మాణ విలువలు ఉన్నతంగా కున్నాయి. ఏజెంట్ ఫరూక్ పాత్రలో కరణ్ టాకర్ ఆకట్టుకున్నారు.
ఏమి బాగోలేదు?
ఆసక్తికరంగా మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మూడు ఎపిసోడ్స్ ఆసక్తి లేకుండా నెమ్మదిగా సాగాయి. అసలు కథకు సంబంధం లేని కే కే మీనన్ చేసిన పాత్ర నేపథ్యంతో సాగదీశారు. కరణ్ టాకర్ మరియు సంజనమా మధ్య నడిచే కెమిస్ట్రీ మంచి అనుభూతిని పంచలేదు.
ఇక చాలా సన్నివేశాలు క్రియేటివిటి కోసం లాజిక్ వదిలేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సిరీస్ లో మనకు కనిపించదు
చివరి మాటగా?
మంచి ఆరంభం, అలరించే చివరి ఎపిసోడ్స్ స్పెషల్ ఓప్స్ సిరీస్ ఆకర్షణీయంగా మలచాయి. కె కె మీనన్ నటన ఆకట్టుకొనే మలుపులు మరియు ప్రొడక్షన్ వాల్యూస్ మంచి అనుభూతిని ఇస్తాయి.పట్టులేని స్క్రీన్ ప్లే, మధ్యలో నెమ్మదించిన కథనం నిరాశ పరిచే అంశాలు. మొత్తంగా ఈ సిరీస్ చూడదగినదే.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో హిందీ చిత్రం ఎక్సోన్ ని ఎంచుకోవడం జరిగింది. నికోలస్ ఖర్కోన్గర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..
కథాంశం ఏమిటీ?
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాన్బి(లిన్ లైశ్రమ్), ఉపాసన(సాయని గుప్తా) మీనమ్(అసేన్ల జమీర్) ఢిల్లీలోని ఓ మిడిల్ క్లాస్ ఇంటిలో అద్దెకు ఉంటారు. ఆ ఇంటి యజమానురాలైన (డాలీ అహ్లువాలియా) ప్రతి చిన్న విషయానికి ఆ ముగ్గురు అమ్మాయిలతో గొడవపడుతూ ఉంటుంది. ఓ రోజు మీనమ్ ఐ ఏ ఎస్ ఇంటర్వ్యూకి వెళుతుంది, అలాగే ఆమెకు పెళ్లి కూడా కుదురుతుంది. ఈ సంధర్భంగా ఆమెకు ఓ సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వాలని వారి సాంప్రదాయ వంటకమైన ఎక్సోన్ వండాలి అనుకుంటారు . పంది మాంసంతో చేసే ఆ వంటకం వండేటప్పుడు దుర్భరమైన వాసన వస్తుంది. దీనితో ఇంటి యజమానురాలితో పాటు, నైబర్స్ గొడవ చేయడంతో సమస్య మొదలవుతుంది. ఎలాగైనా ఎక్సోన్ వంటకాన్ని వండి తీరాలనుకున్న ఆ మిత్రుల కోరిక తీరిందా లేదా అనేది మిగతా కథ…
ఏమి బాగుంది?
భారత దేశంలో భాగమైనప్పటికీ రంగు, రూపు, ఆహారపు అలవాట్ల కారణం ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఢిల్లీ లాంటి ప్రదేశాలలో ఎదురయ్యే జాతి వివక్ష వంటి విషయాలను హ్యూమరిక్ అండ్ ఎమోషనల్ యాంగిల్ లో దర్శకుడు చక్కగా చెప్పాడు. కెరీర్ మరియు లైఫ్ కోసం ఢిల్లీ వచ్చిన ఆ ప్రాంత ప్రజల పట్ల స్థానిక ప్రజల ఆధిపత్యం, వేదింపులు వంటి విషయాలు ప్రస్తావించిన తీరు బాగుంది.
ఇక కఠిన సంధర్బాలలో స్నేహితులు ఒకరికొకరు ఎలా నిలబడతారనే చక్కని స్టోరీగా ఇందులో ఉంది. లిన్ మరియు సయాని గుప్త అద్భుత నటనతో ఆకట్టుకోగా రోహన్ జోషి మంచి ఎంటర్టైన్మెంట్ పంచారు.
ఏమి బాగోలేదు?
ముఖ్యంగా జాతి వివక్ష గురించిన ప్రధాన ప్రస్తావనతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ అంశాన్ని సీరియస్ గా ప్రస్తావించలేదు. దానికి బదులు ఎక్కువుగా హ్యూమర్ అండ్ డ్రామా పై ఫోకస్ చేశారు. పాత్రల మధ్య సంఘర్షణ కూడా మనకు కనిపించదు. ఇక ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిల పాత్రలు మాట్లాడుకొనే సంధర్భంలో సబ్ టైటిల్స్ మిస్సవడంతో వారి మధ్య సంభాషణలు అర్థం కావు.
చివిరి మాటగా
ఒక్క చిన్న వంటకం చేయడానికి ఎదురైన ఇబ్బంది చుట్టూ ఇతరుల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాల పట్ల భారత ప్రజలలో ఉండే చులకన భావన, ఓర్చుకోలేని గుణం వంటి విషయాలను, వివక్షతను చెప్పిన విధానం ఈ మూవీ ప్రధాన బలంగా. ఓ సోషల్ ఇష్యూస్ ని హ్యూమరిక్ గా చెప్పిన దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం, జాతి వివక్షత అనే పాయింట్ పై అంతగా శ్రద్ద పెట్టకపోవడం నిరాశ పరిచే అంశాలు. మొత్తంగా ఎక్సోన్ మంచి అనుభూతిని పంచే వైవిధ్యమైన చిత్రం.
ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సిరిస్ ‘ఈట్ హాపెండ్ ఇన్ కోల్‌కతా ‘. కెన్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ‘ఆల్ట్‌బాలాజీ’లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరిస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథా నేపథ్యం :
ఈ సిరీస్ 1962 సంవత్సరంలో కలకత్తా నేపథ్యంలో జరుగుతుంది. కుసుమ్ గంగూలీ (నగ్మా రిజ్వాన్) ఒక ప్రసిద్ధ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అవుతుంది. మరోవైపు, రోనో బీర్ ఛటర్జీ ( కరణ్ కుంద్రా ) ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు, కానీ కుసుమ్ గంగూలీ అతన్ని తిరస్కరిస్తుంది. ఆ తరువాత జరిగిన జరిగిన కొని సంఘటనల అనంతరం కుసుమ్ గంగూలీ, రోనో బీర్ తో ప్రేమలో పడుతుంది. అయితే రోనో బీర్ ఆమెను మోసం చేసి, ఆమెను బాధ పెడతాడు. ఆ తరువాత 1971లో ఇండో -పాక్ నేపథ్యంలో ఇద్దరూ మరోసారి కలవాల్సి వస్తోంది. ఈ సమస్యాత్మక సమయంలో ఈ జంట తమ ప్రేమను ఎలా తిరిగి పొందింది అనేదే మిగిలిన కథ.
ఏం బాగుంది :
ఈ సిరీస్ లో కరణ్ కుంద్రా ప్రధాననమైన పాత్రను పోషించాడు. ఘనమైన పనితనం కనబర్చాడు. అతని లుక్, పెర్ఫార్మెన్స్ మరియు డైలాగ్ డెలివరీ అద్భుతంగా అనిపిస్తాయి. అతని టాలెంట్ ఈ సిరీస్ పై పూజ్యమైన ప్రభావాన్ని కలిగించింది. ఇక కుసుమ్ పాత్రలో అరంగేట్రం చేసిన నగ్మా రిజ్వాన్ కూడా బాగా నటించింది. ఆమె మొత్తం ప్రదర్శన పైనే ఈ సిరీస్ ఆధారపడింది అందుకు తగ్గట్లుగానే తన పాత్రలో ఆమె బాగా చేసింది. ప్రేమకథ ఉంచిన ప్రాథమిక అమరిక మనోహరంగా అనిపిస్తుంది. నటీనటుల ప్రదర్శనతో పాటు అందమైన విజువల్స్ , నిర్మాణ విలువలు మరియు కెమెరా పనితనం చాలా బాగున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ ప్రారంభ భాగంలోని కొన్ని కాలేజీ ఎపిసోడ్‌లు చాలా చక్కగా రూపొందించబడ్డాయి.
ఏం బాగాలేదు :
ఈ ప్రదర్శన 1969 నటి కాలంలో ఉంది, కానీ మేకర్స్ చాలా సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నారు. అప్పటి పరిస్థితులను ఫాలో అవకపోవడం, సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం మరియు అనేక ఇతర సమస్యలు ఉన్నాయి, అవన్నీ అప్పటి సంస్కృతిలో ఏమాత్రం లేవు. సీన్స్ ను ఆకర్షణీయంగా మలచడానికి, మేకర్స్ కమర్షియల్ హంగులు జోడించారు, పైగా కథ కూడా చాలా రొటీన్ గా ఉంది.
చివరి మాటగా :
మొత్తంమీద, కలకత్తా నేపథ్యంలో వచ్చిన ఈ ‘ఈట్ హాపెండ్ ఇన్ కోల్‌కతా’ సిరీస్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. అయితే బ్యాక్‌డ్రాప్ తో పాటు కథ కూడా పాతదే కావడం మైనస్. కథనం కూడా వాస్తవికంగా ఉండదు. కానీ వినోదాత్మకంగా సాగుతూ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. మీరు పీరియాడిక్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారైతే, ఈ సిరీస్ చూడొచ్చు. అంతకు మించి ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పటానికి ఏమీ లేదు.
నేటి లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా కామెడీ అండ్ రొమాంటిక్ హిందీ వెబ్ సిరీస్ పతి పత్ని ఔర్ వాహ్ ని ఎంచుకోవడం జరిగింది. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటి?
బెనారస్ ప్రాంతానికి చెందిన మోహన్ (అనంత్ విధాత్) భార్య సురభి(విన్నీ అరోరా) అకాల మరణం చెందుతుంది. భర్తపై ప్రేమ కలిగిన సురభి ఆత్మ మోహన్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు రెండో పెళ్లి చేసుకోవాలని మోహన్ సిద్ధం అవుతాడు. ముఖం కూడా చూసుకోకుండా రిమ్ జిమ్(రియా సేన్) ని పెళ్లి చేసుకున్న మోహన్ ఫస్ట్ నైట్ రోజు ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతాడు. ఐతే ఆత్మగా ఉన్న సురభి ఆమెను చూసి ఈర్ష్య పడుతుంది. ఆత్మ రూపంలో మోహన్, రిమ్ జిమ్ దాంపత్య జీవితానికి అడ్డుపడుతుంది. మరి ఈ ముగ్గురి మధ్య రొమాంటిక్ డ్రామా ఎలా ముగిసింది అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎంటర్టైనర్ సుల్తాన్ చిత్రంలో ప్రాధాన్యం ఉన్న రోల్ చేసిన అనంత్ విధాత్ ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్రలో మెప్పించారు. అతని ఇన్నోసెంట్ మరియు రొమాంటిక్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. చనిపోయిన ఆత్మగా మారి ఈర్ష్యతో భర్తను విసిగించే భార్య పాత్రలో నటి విన్నీ అరోరా బాగా చేశారు. ఐతే ఈ వెబ్ సిరీస్ లో అందరినీ ఆకట్టుకొనే పాత్ర మాత్రం రిమ్ జిమ్. గ్లామర్ పాత్రలకు పేరున్న రియా సేన్ నటనకు స్కోప్ ఉన్న పాత్రను చక్కగా రక్తి కట్టించింది. అటు గ్లామర్ మరియు యాక్షన్ తో ఆమె మెప్పించింది.
ఇండియాలో భర్తల పట్ల భార్యలకు ఉండే ప్రేమ, దాని వలన ఇతరులు దగ్గరైతే ఓర్చుకోలేని గుణం వంటి విషయాలను చక్కగా చర్చించారు. నిర్మాణ విలువు బాగున్నాయి. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని ఎపిసోడ్స్ లో హాస్యం ఆకట్టుకుంది.
ఏమి బాగోలేదు?
మొదటి రెండు ఎపిసోడ్స్ సిరీస్ పై ఆసక్తి రేపగా మూడవ ఎపిసోడ్ నుండి సిరీస్ పట్టు కోల్పోయింది. ఈ సిరీస్ లో పాత్రలు తీరు, వాటి మధ్య ఎమోషనల్ బాండింగ్ కుదరలేదు. ఇక ఆత్మ వంటి విషయాలు నేటి తరానికి ఒంటబట్టని విషయాలు అని చెప్పాలి.
చివరి మాటగా
మొత్తంగా పతి పత్ని ఔర్ వాహ్ అక్కడక్కడా ఆకట్టుకొనే ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. సిరీస్ ప్రారంభించిన విధానం.. ముగింపు కొంత మేర ఆకట్టుకున్నా మధ్యలో ఎపిసోడ్స్ నిరాశపరిచాయి. విలేజ్ టైప్ కామెడీ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి ఒకింత నచ్చే అవకాశం కలదు.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ హారర్ సిరీస్ ని ఇచ్చుకోవడం జరిగింది. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉన్న భూతియా గిరి3 హారర్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటీ?
టాప్ కంపెనీ సీఈఓ అయినా దిల్వార్ రానా(సుమీత్ వ్యాస్) జైలునుండి తన కంపెనీ కార్యక్రమాలు చక్కబెడుతూ ఉంటాడు. ఐతే దిల్వార్ రానాను దెయ్యాలు తిరిగే ఓ పెద్ద హోటల్ నడపాల్సిన కండిషన్ పై కొందరు జైలు నుండి బయటకు తీసుకువస్తారు. దెయ్యాలు తిరిగే ఆ హోటల్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తీసుకున్న దిల్వార్ రానా, ఆ హోటల్ తో చిన్ననాటి బంధం కలిగి ఉంటాడు. మరి శపించ బడిన ఆ హోటల్ దిల్వార్ రానా ఎలా నడిపాడు అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
ఆరంభ ఎపిసోడ్స్ తో పాటు, దెయ్యాలు తిరిగే హోటల్ ని నడపడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రధాన పాత్ర చేసిన సుమీత్ వ్యాస్ పాత్రకు న్యాయం చేశారు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ కూడా మంచి నటన కనబరిచారు.
కథలో అంతర్లీనంగా వచ్చే కామెడీ బాగుంది. బీజీఎమ్ అలరిస్తుంది. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఏమి బాగోలేదు?
ప్రారంభ ఎపిసోడ్స్ ఓ కొత్త తరహా హారర్ సిరీస్ చూడబోతున్నాం అన్న ఆలోచన రేకెత్తిస్తుంది. ఐతే ఎపిసోడ్స్ గడిచే కొద్దీ ఇది ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోయింది. హారర్ డ్రామా కాస్తా అంచనాలకు అందుతూ ఆసక్తిలేకుండా సాగుతుంది. రాబోయే సన్నివేశం ఏమిటనేది ప్రేక్షకుడి తెలిసిపోతుంటే ఎటువంటి అనుభూతి కలగదు. ఇక లాజిక్ లేని సిల్లీ సన్నివేశాలు చాలానే ఈ సిరీస్ లో ఉన్నాయి.
ఇక ఈ సిరీస్ బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. మలుపులు లేని కథనం బోరింగ్ గా సాగుతుంది. ఇక అప్పుడప్పుడు వచ్చిపోయే హారర్ సన్నివేశాలు ఏమాత్రం ఉత్కంఠ, భయం కలిగించలేకపోయాయి.
చివరి మాటగా
మొత్తంగా చెప్పాలంటే భూతియాగిరి 3 ఆ ప్రారంభ ఎపిసోడ్స్ మినహాయించి ఏ దశలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది . బలహీనమైన కథనంలో వచ్చే సన్నివేశాలు ముందుగా తెలిసిపోతుంటే మంచి అనుభూతి కలగదు. ఏమాత్రం ఉత్కంఠ, భయం ఈ హారర్ సిరీస్ కలిగించలేదు.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు రొమాంటిక్ క్రైమ్ డ్రామా ‘ది కాసినో’ ని ఎంచుకోవడం జరిగింది. జీ 5లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం
కథాంశం ఏమిటీ?
నేపాల్ లోని ఓ విలాసవంతమైన కాసినో అధిపతిగా మార్వా(సుధాన్ష్ పాండే) ఉంటాడు. ఇదే క్యాసినోలో డాన్సర్ గా పనిచేసే రిహానా(మందాన కరిమీ) మార్వాను వశపరుచుకొని అతని దగ్గర డబ్బు గుంజాలని చూస్తూ ఉంటుంది. ఐతే మార్వా కొడుకు అయిన విక్కీ మార్వా(కరణ్వీర్ బోహ్రా) కి ఈ వ్యవహారం నచ్చదు. ఐతే కిలాడీ రిహానా తండ్రి కొడుకులు ఇద్దరినీ తన ట్రాప్ లో పడేసే ఆలోచనలో ఉంటుంది. మరి విలాసవంతమైన ఆ కాసినో చుట్టూ తిరిగే ఈ కథ చివరికి ఎలా ముగిసింది అనేది మిగతా కథ…
ఏమి బాగుంది?
అధికారం, ఆధిపత్యం హోదా, డబ్బు కోసం తండ్రి కొడుకులు మరియు ఓ అందమైన అమ్మాయి మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ ప్లే దర్శకుడు చక్కగా నడిపారు. డాడీ పాత్ర చేసిన యంగ్ యాక్టర్ సుధాన్ష్ పాండే లుక్ పరంగా కన్వీన్గింగ్ గా లేకున్నా నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఐతే షో ఆద్యంతం తానై నడిపింది మందాన కరిమీ. ఆమె గ్లామర్ , బోల్డ్ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అని చెప్పాలి.
ఇక కథలో భాగంగా వచ్చే ట్విస్ట్స్ అలరిస్తాయి. మనీ మరియు స్వార్ధం చుట్టూ తిరిగే ఈ సిరీస్ లో ఆ విషయాలను చక్కగా తెరకెక్కించారు. ఇక మరో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిన కరణ్వీర్ బోహ్రా నటనతో ఆకట్టుకున్నారు. బీజీఎమ్, నిర్మాణ విలువలు మరియు కెమెరా వర్క్ మెప్పించాయి.
ఏమి బాగోలేదు?
జూదం, సెక్స్, డ్రగ్స్, క్రైమ్స్ కి అడ్డాగా భావించే కాసినో అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఆ విషయాలపై అంతగా ఫోకస్ చేయలేదు. ఇక ఆ కాసినో గురించి అంతగా కొట్టుకోవడానికి బలమైన కారణం కనిపించదు. ప్రధాన పాత్రధారులు మంచి నటన కనబరిచినా, మిగతా చాలా పాత్రలకు అనుభవం లేని నటులను తీసుకున్నారు. ఇక మిడిల్ ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి. నెక్స్ట్ సీజన్ దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ కూడా సంపూర్ణంగా ముగించలేదు.
చివరి మాటగా
మొత్తంగా ది కాసినో మనీ, స్వార్ధం చుట్టూ నడిచే ఆధిపత్య పోరుగా బాగానే సాగుతుంది. ఐతే కొంచెం బోరు కొట్టే మిడిల్ ఎపిసోడ్స్, అసంపూర్ణమైన ముగింపు నిరాశపరిచే అంశాలు. రొమాన్స్ తో కూడిన క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారు ఓ సారి ఈ సిరీస్ చూడవచ్చు.
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకం పై దర్శకుడు, నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్’లో ఈ రోజు విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
ఏడు నెలలు గర్భవతి అయిన రిథమ్ (కీర్తి సురేష్) ఎంతో కష్టపడి మిస్ అయిపోయిన తన కొడుకు (అజయ్)ను వెతికి పట్టుకునే క్రమంలో పడిన మానసిక సంఘర్షణ, ఆ వెతుకులాటలో ఆమె ఎదురుకునే ఆవేదన మరియు బాధతో సాగే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా. అయితే అసలు రిథమ్ కొడుకునే ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఆ చేసిన వ్యక్తి చార్లీ చాప్లిన్ గెటప్ లో ఎందుకు ఉన్నారు ? ఈ మధ్యలో కొడుకు మిస్ అవ్వడంతో రిథమ్ మొదటి భర్తతో విడిపోవాల్సి రావడం, రెండో భర్త ద్వారా మళ్ళీ ఆమె తల్లి కాబోతుండటం ? చివరికీ రెండో బిడ్డ కూడా ప్రమాదంలో పడటం ? ఈ నాటకీయ పరిణామాల్లోనే ఆమె కిడ్నాపర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? ఈ మొత్తం క్రమంలో ఆమె తన ఇద్దరి బిడ్డలను ఎలా కాపాడుకున్నది అన్నదే మిగత కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్ర రిథమ్ (కీర్తి సురేష్) పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘పెంగ్విన్’ ఇంట్రస్ట్ గానే సాగింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నుండి సస్పెన్స్ సీన్స్ అండ్ ఎమోషన్స్ ట్రీట్మెంట్ లో బాగా రాసుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మెయిన్ గా కొడుకు మిస్ అయ్యాక వెతికే సన్నివేశాల్లో మరియు డాక్టర్ సీక్వెన్స్ లో ఆమె నటన.. అలాగే ఆమె పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి.
న్యూ యాంగిల్ లో ఓ తల్లి పాయింట్ అఫ్ వ్యూలో ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తీసుకొవడం… దాన్ని స్క్రీన్ మీద ఇంట్రస్టింగ్ గా మలచడంలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వ పనితనం బాగుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రంగా ఈ సినిమాని మలిచారు. లోన్లీగా ఫీల్ అయ్యే ప్రతి తల్లికి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుంది. ఇక మొదటి భర్తగా నటించిన నటుడు లింగ, అలాగే భావన పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. డైరెక్టర్ షాట్ మేకింగ్ అండ్ అతని విజన్ చాలా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. కొన్ని సన్నివేశాల్లో మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరోయిన్ కి ఇచ్చిన లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.
అయితే ఈశ్వర్ కార్తీక్ దరకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మరియ క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ విభిన్నంగా ఉండటంతో.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు. దానికి తోడూ మొదటి భాగం కథనంలో ప్లో అర్ధం కాకుండా ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతోంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. సినిమా విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు. అయితే సీన్ మూడ్ తో పాటు ఓవరాల్ సినిమాని దృష్టిలో పెట్టుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్లాష్ బ్యాక్ కి లైవ్ కి మధ్య స్మూత్ కట్టింగ్ తో సినిమాని చక్కగా ఎడిట్ చేశారు. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
వైవిధ్యమైన కంటెంట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా బోర్ గా సాగడం, కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం లాంటివి సినిమాకి డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ముందు చెప్పుకున్నట్లు.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ ను ఈ సినిమా మెప్పించదు.
123telugu.com Rating : 2.75/5 Reviewed by 123telugu Team
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ ఫిల్మ్ చమన్ బాహర్ ఎంచుకోవడం జరిగింది. రొమాంటిక్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..
కథాంశం ఏమిటీ?
చత్తీష్ ఘడ్ లోని ఒక చిన్న ఊరి చివర బిల్లు (జితేంద్ర కుమార్) ఓ పాన్ డబ్బా పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. నిస్తేజంగా సాగుతున్న అతని జీవితంలోకి రింకు ( రతికా బడినాయ్)రాకతో కొత్త మలుపు తిరుగుతుంది. రింకు ఫ్యామిలీ తన పాన్ కొట్టు ఎదుటి ఇంటిలో దిగుతారు. మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడిన బిల్లు ఆమె ప్రేమకోసం పరితపిస్తూ ఉంటాడు. రింకు అందం చూసి ఊరిలో కుర్రాళ్ళు అందరూ తన వెనుకే పడతారు. బిల్లు పాన్ డబ్బా దగ్గరకొచ్చి రింకు కు లైన్ వేస్తూ ఉంటారు. మరి ఇంత హెవీ కాంపిటీషన్ మధ్య బిల్లు… రింకు ప్రేమను గెలిచాడా? లేదా? అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
ఈ మూవీ స్టోరీ ఐడియా కొత్తగా మెప్పిస్తుంది. శుబ్ మంగళ్ జ్యాదా సావధాన్ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన జితేంద్ర కుమార్ ఈ మూవీలో మంచి నటనతో ఆకట్టుకున్నారు. భిన్న షేడ్స్ ఉన్న పాత్రను జితేంద్ర తన సహజమైన నటనతో మెప్పించారు. సోను నిగమ్ పాడిన రెండు సాంగ్స్ అద్బుతంగా ఉన్నాయి.
ఓ చిన్న ఊరిలోకి అందమైన అమ్మాయి వస్తే తన వెంటపడే యువకుల మనస్తత్వాలు చక్కగా వివరించారు. హీరోయిన్ గా నటించిన రతిక పాత్రకు అంతగా పరిదిలేదు. ఐతే ఆమె తెరపై క్యూట్ గా కనిపించారు. హీరోకి, అతని తండ్రి కి మధ్య రిలేషన్ ఆకట్టుకుంటుంది. కథలో ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ చక్కగా కుదిరాయి.
ఏమి బాగోలేదు?
మెల్లగా సాగే కథనంతో పాటు హీరోయిన్ పాత్రను కేవలం కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు. ప్రధాన కథలోకి వెళ్లడాని చాలా అనవసర సన్నివేశాలతో సాగదీశారు. కథకు అంతగా సంబంధం లేని గ్రామీణ నిరుద్యోగ యువకులకు సంబందించిన సన్నివేశాలు ఎడిట్ చేయాల్సింది.
మొత్తంగా
మెల్లగా సాగే కథనం మినహాయిస్తే ఈ విలేజ్ ప్రేమ కథ చాల వరకు మెప్పిస్తుంది. జితేంద్ర నటన, ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ రతిక క్యూట్ లుక్స్ ఆకట్టుకొనే అంశాలు. మొత్తంగా చమన్ బాహర్ ఆకట్టుకొనే చిత్రమే అని చెప్పాలి.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ ఆర్య ను ఎంచుకోవడం జరిగింది. హీరోయిన్ సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటీ?
వ్యాపారవేత్త తేజ్ సరీన్(చంద్రచూర్ సింగ్) భార్య అయిన ఆర్య(సుస్మితా సేన్) తన ముగ్గురు పిల్లలతో హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటుంది. ఆర్య భర్త తేజ్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపివేయడంతో ఆమె జీవితంలో సమస్యలు మొదలవుతాయి. ఆమె భర్త వెనుక ఉన్న నేర సామ్రాజ్యం ఆమె కుటుంబానికి ప్రమాదంగా మారుతుంది. దీనితో ఆర్య తన భర్తను చంపిన వారి కోసం వేట మొదలుపెడుతుంది. అసలు తేజ బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? అతన్ని చంపింది ఎవరు? ఆర్య, తేజాను చంపిన వారి నుండి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంది? అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
హీరోయిన్ సుస్మిత సేన్ తన నటనతో సిరీస్ కి గొప్ప ఆకర్షణ తీసుకువచ్చింది. తన పిల్లల కోసం మాఫియా పై తిరగబడిన బ్రేవ్ మదర్ గా ఆమె ఫెరోషియస్ రోల్ ప్రేక్షకుడిని సిరీస్ లో ఇన్వాల్వ్ చేసింది. ఇక కీలక రోల్ చేసిన సికందర్ ఖేర్ మరియు సీనియర్ నటుడు చంద్రాచూర్ సింగ్ మెప్పిస్తారు.
ఈ సిరీస్ చెప్పుకోదగిన మరో అంశం బీజీమ్. సన్నివేశాలు మంచి ఫీల్ లో నడిచేలా బీజీఎమ్ ప్రధాన భూమిక పోషించింది. తేజ్ మర్డర్ వెనుక ఎవరున్నారు అనే సస్పెన్సు బాగా క్యారీ అయ్యింది. స్టోరీ నేరేషన్ కూడా బాగుంది.
ఏమి బాగోలేదు?
సుదీర్ఘమైన నిడివి కలిగిన మెల్లగా సాగే ఎపిసోడ్స్ ఒక దశలో విసుగుపుట్టిస్తాయి. ఎడిటింగ్ వైఫల్యం వలన చాలా అనవసర సన్నివేశాలతో సిరీస్ నిండిపోయింది.
చివరి మాటగా
మొత్తంగా చెప్పాలంటే.. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ తో సాగే ఈ క్రైమ్ డ్రామా ఆసక్తికరంగానే సాగుతుంది. మెల్లగా సాగే సుదీర్ఘమైన ఎపిసోడ్స్ నిరాశపరిచే అంశాలు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ సిరీస్ గా చెప్పవచ్చు.
ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సినిమా ‘వాస్ప్ నెట్ వర్క్’. ఆలివర్ అస్సాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథా నేపథ్యం :
ఈ ‘వాస్ప్ నెట్ వర్క్’ కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. క్యూబాలో ఉగ్రవాద కార్యకలాపాలను ఆపడానికి యుఎస్ లోని ఒక ప్రధాన సంస్థలోకి చొరబడిన క్యూబన్ గూఢచారుల కథను చెబుతూ ఈ సిరీస్ సాగుతుంది. 1959 లో క్యూబన్ విప్లవం తరువాత, అనేక ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు అమెరికాకు పారిపోయి ఫ్లోరిడాలోని మయామిలో స్థిరపడ్డారు. ఆ తరువాతి కొన్ని దశాబ్దాలలో, వారు క్యూబన్ అమెరికన్ నేషనల్ ఫౌండేషన్ (CANF) అనే సంస్థను ఏర్పాటు చేస్తారు. క్యూబాలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాడటానికి మరియు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయడానికి ఇతర దేశాల మద్దతు సంపాదించడమే వారి అసలు ఆలోచన. ఈ క్రమంలో ‘90 లలో, క్యూబా నుండి చాలా మంది ప్రజలు అమెరికాకు వెళ్లి, క్యూబన్ అమెరికన్ నేషనల్ ఫౌండేషన్ లో పాలుపంచుకుంటారు, అలాగే మాజీ క్యూబన్‌లలో కొంతమందిని డ్రగ్స్ ను రవాణా చేస్తూ దాని ద్వారా సంపాదించిన డబ్బుతో క్యూబాలో వినాశనం సృష్టించడానికి ఉపయోగిస్తారు. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి ? చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ.
ఏం బాగుంది :
మొదట ఈ ఈ ‘వాస్ప్ నెట్ వర్క్’ పై ఆసక్తి ఉండాలంటే.. మొదట ప్రపంచ చరిత్ర మరియు రాజకీయాలపై కొంత అవగాహన అండ్ ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. పైగా ఈ సిరీస్ ‘90 లలో క్యూబాలో ఏమి జరిగిందనే దాని పై ఆసక్తికరమైన అవగాహన ఇస్తుంది. అలాగే యుఎస్ మరియు క్యూబా మధ్య ఉన్న సంబంధాల గురించి మరియు క్యూబన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆర్థిక ఆంక్షల గురించి చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ఈ చిత్రం ‘90 లలో సోవియట్ యూనియన్ పతనం తరువాత క్యూబన్ల జీవితాలను బాగా ఎలివేట్ చేసింది.
ఫిడేల్ కాస్ట్రో పాలనను ‘క్యూబన్ అమెరికన్ నేషనల్ ఫౌండేషన్’ ఎందుకు దించాలని కోరుకుంటుంది మరియు సోవియట్ యూనియన్ పతనం వారికి పెద్ద అవకాశాన్ని ఇచ్చిందనే దాని వెనుక ఉన్న నిరాశను మరియు ఆ అంశం పై మనం అర్థం చేసుకోవడానికి గల చారిత్రక సందర్భాలను ఈ సిరీస్ బాగా చూపించింది. ఈ చిత్రం గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే, ఈ అంశాలన్నింటిపై అంతర్దృష్టితో పాటు ఇంట్రస్టింగ్ ప్లే కూడా ఉంటుంది. పైగా ఏమి చెప్పాలనుకుంటున్నారో దాని గురించి చాలా ఆసక్తిగా చెప్పారు.
ఓల్గా పాత్ర పోషించిన పెనెలోప్ క్రజ్, ఆమె పాత్రలో అద్భుతంగా నటించింది. మరియు ఎడ్గార్ రామిరేజ్ మరియు వాగ్నెర్ మౌరా చెప్పుకోదగిన ప్రదర్శనలు ఇచ్చారు. యోరిక్ లే సాక్స్ మరియు డెనిస్ లెనోయిర్ యొక్క సినిమాటోగ్రఫీ కూడా అద్భుతమైనది.
ఏం బాగాలేదు :
ఆసక్తికరమైన కథ ఉన్నప్పటికీ, వాస్ప్ నెట్‌వర్క్ పూర్తీ ఆసక్తికరమైన చలనచిత్రంగా సాగలేదు. వాస్తవానికి, గూఢచారులు ఉగ్రవాద కార్యకలాపాలను ఎలా ఆపగలిగారు అనే దాని పై దృష్టి సారించినప్పుడు కూడా కనీసం కథనం కూడా పెద్దగా థ్రిల్లింగ్ ఏమీ లేదు. ప్రతిదీ వాస్తవంగా చెప్పబడింది.
ఇంత పెద్ద కథ మొత్తం.. ఆకట్టుకునే కథగా నిర్మించబడలేదు. పైగా ముఖ్యమైన ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్ కూడా చాలా భయంకరంగా అనిపిస్తుంది. కథ యొక్క ప్లోకి పూర్తిగా ఆటంకం కలిగిస్తుంది. గూఢచారుల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కూడా ప్లే ఎలివేట్ చేయలేకపోయింది. కొన్ని చోట్ల చాల సీన్స్ చాలా నిరుత్సాహపరుస్తాయి.
చివరి మాటగా :
స్ట్రీమింగ్ లో ఇప్పటికే గూఢచారుల డ్రామాకు సంబంధించి ఎన్నో సిరీస్ లు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, యూఎస్ – క్యూబా నేపథ్యం కారణంగా ఈ ‘వాస్ప్ నెట్‌వర్క్’ సిరీస్ చాల భిన్నంగా అనిపిస్తుంది; అయితే, ఈ చిత్రం గురించి ఇది ఒక్కటే ఆసక్తికరమైన విషయం.. తమ దేశం కోసం అన్నింటినీ వదులుకున్న గూఢచారుల బ్యాచ్ ఎమోషన్ గురించి, గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా లోతైనా ఎమోషనల్ డ్రామాగా ఇది సాగలేదు. ఈ సినిమా చూడకపోవడమే బెటర్. ఇక మీరు ఇలాంటి డ్రామాలను ఇష్టపడేవారైతే, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ‘ది స్పై’ మంచి ప్రత్యామ్నాయం.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ యువర్ హానర్ ని ఎంచుకోవడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..
కథాంశం ఏమిటీ?
లూథియానా ప్రాంతానికి చెందిన బిషన్ కోష్లా(జిమ్మీ షెర్గిల్) నిజాయితీ పరుడైన జడ్జి. ఐతే ఓ రోజు తన కొడుకు అబీల్(పుల్కిట్ మాకోల్) హిట్ అండ్ రన్ నేరంలో ఇరుక్కుంటాడు. న్యాయానికి విలువ ఇచ్చే జడ్జి అయిన బిషన్ తన కొడుకు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కొడుకు కాబట్టి న్యాయం కళ్లుగప్పి కొడుకును కాపాడుకున్నాడా? సిన్సియర్ జడ్జిగా అతన్ని పోలీసులకు అప్పగించాడా? అనేది మిగతా కథ ..
ఏమి బాగుంది?
జడ్జిగా సిరీస్ కి ప్రధాన పాత్ర చేసిన జిమ్మీ షెర్గిల్ నటన ఈ సిరీస్ కి ప్రధాన ఆకర్షణ. రెండు భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ లో ఆయనది వన్ మాన్ షో కాగా అతని నటన ఆద్యంతం ఆకట్టుకొనేలా సాగింది.
ఇక కీలక పాత్రలు చేసిన నటుల యాక్టింగ్ ఆకట్టుకుంది. చట్టం గురించి తెలిసిన వారు నేరానికి పాల్పడితే వ్యవస్థలను ఎలా వాడుకుంటారు, సాక్ష్యాలను ఎలా తారుమారు చేస్తారు వంటి విషయాలు చక్కగా చూపించారు. మొదటి ఎపిసోడ్స్ అలాగే ముగింపు కూడా బాగుంది.
ఏమి బాగోలేదు?
అధ్బుతమైన ఆరంభం తరువాత వేగం లోపించిన మధ్య ఎపిసోడ్స్ కొంచెం ఇబ్బంది పడతాయి. ఇక చట్టాన్ని చేతిలోకి తీసుకొనే జడ్జి వ్యవహారం ఓ వర్గానికి నచ్చకపోవచ్చు. కొన్ని సన్నివేశాలలో లాజిక్ మిస్సయ్యింది.
చివరి మాటగా
అలరించే ఎమోషన్స్..ఆసక్తిగా సాగే ఇన్వెస్టింగేషన్ సన్నివేశాలతో ఈ సిరీస్ ఆద్యంతం అలరిస్తుంది. కొంచెం నెమ్మదించిన మధ్య ఎపిసోడ్స్ ని మినహాయిస్తే ఈ సిరీస్ మంచి అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ మాస్ట్రామ్ ని తీసుకోవడం జరిగింది. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటీ?
80ల కాలానికి సంబంధించిన నేపథ్యంలో సాగే ఈ కథలో రచయిత రాజారామ్( అన్షుమాన్ ఝా) కెరీర్ లో అనేక సమస్యలు ఎదుర్కుంటూ ఉంటాడు. రాజారామ్ రచనలతో సంతృప్తి చెందని పబ్లిషర్…శృంగార భరితమైన కథలు రాసినప్పుడు మాత్రమే పబ్లిష్ చేస్తాను అంటాడు. మరో దారిలేని రాజారామ్ అలాంటి కొన్ని కథలు రాస్తారు. వాటికి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. ఐతే ఆ కథల రచయిత రాజారామ్ అని ఎవరికీ తెలియదు. దానితో అతనికి కోరుకున్న గుర్తింపు, జీవితం రాదు.. మరి రచయిత రాజారామ్ కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
కామెడీ, అడల్ట్ కంటెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ పెద్దగా పోటీలేని జోనర్ అని చెప్పవచ్చు. ప్రధాన పాత్ర చేసిన అన్షుమాన్ ఝా నటన ఒకింత ఆకట్టుకొనే అంశం. కెరీర్ పై సంతృప్తి లేని రైటర్ పాత్రలో ఆయన మెప్పించారు. ఇక రొమాంటిక్ సన్నివేశాల కొంచెం హద్దులు దాటేశారని చెప్పాలి.
80ల కాలం నేపథ్యం చక్కగా కుదిరించి. ఇక ప్రతి ఎపిసోడ్ లో ఓ శృంగార భరిత సన్నివేశం ఓ వర్గపు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కామెడీ పండించాయి. ఇక పబ్లిషర్ రోల్ చేసిన విపిన్ శర్మ నటన మరో ఆకట్టుకొనే అంశం.
ఏమి బాగోలేదు?
ఓవర్ డోస్ కలిగిన శృంగార సన్నివేశాలతో సాగే ఈ సిరీస్ కేవలం ఓ వర్గాన్ని ఉద్దేశించి తెరకెక్కించిన భావన కలుగుతుంది. ఒక రచయిత కథకంటే కూడా ఇది కేవలం శృంగార భరిత చిత్రంలా తోస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ అసలు చూడలేరు.
ఇక ప్రధాన పాత్రలు చేసిన నటులు మినహా మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేయలేకపోయారు. దీనికి తోడు 10 ఎపిసోడ్స్ నిడివితో సుధీర్ఘంగా సాగుతూ విసుగుపుట్టిస్తుంది.
చివరి మాటగా
మాస్ట్రామ్ అనేది కేవలం ఓ వర్గాన్ని ఉద్దేశించి తీసిన అడల్ట్ కంటెంట్ అండ్ కామెడీ మూవీ. శృంగార సన్నివేశాలు మరియు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో సాగే ఈ సిరీస్ ని అందరూ ఎంజాయ్ చేయలేరు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ దీని జోలికి వెళ్లకపోతే మంచిది. అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది.
ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేడు మేము వీక్షించిన సినిమా హిందీ బుల్‌బుల్. ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథా నేపథ్యం:
ఈ చిత్రం 19వ శతాబ్దంలో బెంగాల్‌లో సెట్ చేయబడింది. బుల్బుల్ (త్రిప్తి డిమ్రీ) అనే స్వేచ్ఛాయుతమైన అమ్మాయి ఇంద్రనిల్ (రాహుల్ బోస్)ను వివాహం చేసుకుంది. అయితే ఇంద్రనిల్ కంటే వయసులో బుల్బుల్ మూడు రెట్లు పెద్దది. ఇక ఇంద్రనిల్ తన పూర్వీకుల ఇంటిలో తన కవల (రాహుల్ బోస్) మరియు తమ్ముడు సత్య మరియు అతని భార్య బినోదిని (పావోలి ఆనకట్ట)తో కలిసి నివసిస్తున్నారు. అయితే ఇంద్రనిల్ వారి గ్రామంలో పురుషులు మాత్రమే చంపబడుతున్నారు. ఈ రహస్య మరణాలపై ఇంద్రనిల్, అతని సోదరుడు దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఆ హత్యల వెనుక అసలు మిస్టరీ బయటకొచ్చింది. అయితే వారిని ఎవరు చంపేస్తున్నారు? ఇందులో అతీంద్రియ కోణం ఉందా? మరియు వీటన్నింటికీ బుల్బుల్‌కు ఏమి సంబంధం ఉంది అనేదే ఈ సినిమా కథ.
ఏం బాగుంది:
ఈ సినిమాకు కెమెరా పనితీరు మరియు కళా దర్శకత్వం అద్భుతంగా ఉంది. పాత పాఠశాల మనోజ్ఞతను మరియు బెంగాల్‌పై రాజ యుగంలో ఈ చిత్రం సెట్ చేయబడిన విధానం మనసును కదిలించింది. కాస్ట్యూమ్స్, మేకప్, నగలు, మరియు మొత్తం కెమెరావర్క్, ఈ చిత్రంలోని విషయాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, అనుష్క శర్మ యొక్క ప్రొడక్షన్ అగ్రస్థానంలో నిలిచిందనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్ర పోషిస్తుంది మరియు ఆమె పాత్రలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. ఆమె పొట్టితనాన్ని మరియు ఆమె ముఖంపై వివిధ భావోద్వేగాలను మోసే విధానం అగ్రస్థానంలో ఉంది. రాహుల్ బోస్ తన ప్రభావవంతమైన పాత్రలో అద్భుతంగా కనిపించడమే కాకుండా ఈ చిత్రానికి సరికొత్త లోతును తెస్తాడు. సీరియస్ పాత్రలో పావోలిదాం చాలా బాగుంది మరియు మిగిలిన నటీనటులు కూడా బాగానే ఉన్నారు.
ఇది మంచి సూపర్ నేచురల్‌గా థ్రిల్లర్ సినిమా. దర్శకుడు అమర్ కౌశిక్ ఈ తీవ్రమైన కథను బ్యాక్‌డ్రాప్‌లో వివరంగా చూపించే నేపథ్యంతో ఎక్కువ సమయం తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో సంభాషణలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మూడ నమ్మకం, పురాణాలు, చరిత్ర మరియు ఫాంటసీ కలిపిన విధానం కూడా బాగుంది. అమిత్ త్రివేది యొక్క BGM అగ్రస్థానంలో ఉంది.
ఏం బాగాలేదు:
స్పూకీ దృశ్యాలు అని పిలవబడేవి ట్రెయిలర్లలో ఉన్నంతగా మిమ్మల్ని భయపెట్టవు. ఈ కథ రెండు టైమ్ జోన్లలో నడుస్తున్నందున కొంచెం క్లిష్టంగా ఉంటుందని, హిందీని అంతగా అర్థం చేసుకోని ప్రేక్షకులు అనుసరించడం కొంచెం కష్టమవుతుందని, బుల్బుల్ పాత్ర కాకుండా, ఇతర పాత్రలకు పెద్ద లోటు లేదని కానీ వారు సినిమాలో ఎందుకు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తున్నారనేది స్పష్టంగా చూపబడలేదని అన్నారు. అయితే బలమైన సాంకేతిక అంశాలతో పాటు, కథనాన్ని సరళంగా మరియు తేలికగా చేయడానికి ఎక్కువ దృష్టి పెట్టాల్సిందని అన్నారు.
చివరి మాటగా:
మొత్తంమీద, బుల్బుల్ అనేది అనేక శైలుల సమ్మేళనం. అతీంద్రియ కోణం, మలుపులు మరియు భయానక ప్రభావాలు ప్రారంభంలో చక్కగా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ చిత్రం సాంకేతిక అంశాలు మరియు అద్భుతమైన విజువల్స్ కలిగి ఉంది, అయితే సినిమా యొక్క తరువాతి భాగం నిస్తేజమైన కథనంతో నెమ్మదిస్తుంది. ప్రీ-క్లైమాక్స్ మరియు ముగింపు చక్కగా నిర్వహించబడుతున్నాయి. అయితే సినిమాపై ఎక్కువ హైప్ పెట్టుకోకుండా, తక్కువ అంచనాలతో చూడవచ్చు.